అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు(Afghanistan Crisis) సిద్ధమవుతోన్న తాలిబన్లు.. పాత ప్రభుత్వానికి చెందిన ఈ-మెయిళ్లపై దృష్టిపెట్టారు. వాటి యాక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గూగుల్ వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ ప్రభుత్వానికి చెందిన ఈ-మెయిల్ అకౌంట్లను తాత్కాలికంగా స్తంభింపజేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న గూగుల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు రాయిటర్స్ వార్తాకథనం పేర్కొంది.
అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు(Afghan Taliban).. అమెరికాకు అనుకూలంగా పనిచేసినవారి వివరాలు తెలుసుకునేందుకు అఫ్గాన్ ప్రభుత్వ డేటాబేస్‌ను ఉపయోగించే అవకాశముందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందుకోసం ప్రభుత్వ అధికారిక ఈ-మెయిళ్ల ఖాతాలను పొందేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని గత ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. తాను పనిచేస్తున్న మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్ల డేటాను భద్రపర్చమని గత నెల తాలిబన్ ప్రతనిధి ఒకరు తనను కోరినట్లు ఆ అధికారి వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ అధికారి వివరాలను రాయిటర్స్ బయటపెట్టలేదు.
దీంతో గూగుల్ చర్యలు చేపట్టింది. అఫ్గాన్ ప్రభుత్వ ఈ-మెయిల్ ఖాతాలను తాత్కాలికంగా లాక్ చేసినట్లు సమాచారం. అఫ్గాన్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రభుత్వ ఖాతాల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఖాతాల స్తంభనపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించింది.