తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆగని కరోనా ఉద్ధృతి- తగ్గని మరణాలు

ప్రపంచదేశాలపై కరోనా విలయం విధ్వంసకరంగా సాగుతోంది. పలు దేశాలు ఈ మహమ్మారి ధాటికి అట్టుడికిపోతున్నాయి. మెక్సికో, రష్యా, అమెరికాలో తీవ్రత అధికంగా ఉంది. చైనాలో గత 8 రోజులుగా స్థానికంగా ఎలాంటి కేసులు నమోదుకాలేదు. న్యూజిలాండ్​లో మళ్లీ వైరస్ వ్యాప్తి మొదలైంది.

Global COVID-19 tracker
ఆగని కరోనా ఉద్ధృతి- తగ్గని వైరస్ మరణాలు

By

Published : Aug 24, 2020, 8:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విశృంఖలంగా వ్యాప్తి చెందుతోంది. మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 36 లక్షలకు పెరిగింది. 8 లక్షల 13 వేల మందికి పైగా బాధితులు మరణించారు. కరోనా నుంచి కోటి 61 లక్షల మంది కోలుకోగా.. 66 లక్షల 91 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షల 75 వేలకు చేరింది. ఈ మహమ్మారి సోకి లక్షా ఎనభై వేల మంది బలయ్యారు. 31 లక్షల మందికిపైగా కోలుకోగా.. 25 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రష్యాలో కొత్తగా 4,744 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 9.61 లక్షలకు పెరిగింది. మరో 65 మంది మరణించారు. ఫలితంగా మృతుల సంఖ్య 16,448కి చేరుకుంది.

మెక్సికోలో తీవ్రం...

మెక్సికోలో వైరస్ విజృంభణ తీవ్రంగా ఉంది. మృతుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటిపోయింది. మరో 226 మంది తాజాగా మరణించారు. కొత్తగా నమోదైన 3,948 కేసులతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5.60 లక్షలకు చేరింది.

దక్షిణ కొరియా

వరుసగా పదకొండో రోజు దక్షిణ కొరియాలో మూడంకెల కరోనా కేసులు నమోదయ్యాయి. 266 మందికి పాజిటివ్​గా ,తేలింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కేసులు బయటపడుతున్నాయి. కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 17,665కి పెరిగింది. ఇప్పటివరకు 309 మంది మృతి చెందారు.

న్యూజిలాండ్​లోనూ

న్యూజిలాండ్​లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మరో 9 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో బాధితుల సంఖ్య 1,683కి చేరింది. మొత్తం 22 మంది మరణించారు.

ఆక్లాండ్​లో లాక్​డౌన్​ను మరో నాలుగురోజుల పాటు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు వారాల లాక్​డౌన్ కొనసాగుతోంది. దీనిని ఆదివారం వరకు పెంచుతున్నట్లు తెలిపారు.

కరోనా పుట్టినిల్లులో..

స్థానికంగా చైనాలో గత 8 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. 16 కొత్త కేసులను గుర్తించగా.. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. చైనాలో మొత్తం 84,967 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో 4,634 మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం 408 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 79,925 మంది బాధితులు కోలుకున్నారు.

మరోవైపు హాంకాంగ్​లో కొత్తగా 25 కేసులు బయటపడ్డాయి. ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 4,692కి చేరగా.. ఇప్పటివరకు 77 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఆస్ట్రేలియాలో..

ఎనిమిది వారాలుగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా తగ్గుముఖం పడుతోంది. విక్టోరియాలో కొత్తగా 115 కేసులు బయటపడగా.. 15 మరణాలు సంభవించాయి. జులై 5 తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 24,916 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 517 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details