ఆగని కరోనా ఉద్ధృతి- రష్యాలో 9 లక్షల కేసులు - covid
ప్రపంచదేశాలపై కరోనావైరస్ వినాశకరమైన ప్రభావం చూపుతోంది. కేసులు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2.75 లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్ల ఏడు లక్షలకు ఎగబాకింది. బ్రెజిల్, అమెరికాల్లో వైరస్ విలయతాండవం చేస్తుండగా... రికవరీలు సైతం పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది.
తగ్గని కరోనా ఉద్ధృతి- పెరుగుతున్న రికవరీలు
By
Published : Aug 13, 2020, 8:42 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. వివిధ దేశాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఒక్కరోజులో 2,75,069 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్ల 7 లక్షలకు చేరింది. 6,600కు పైగా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 7.51 లక్షలు దాటింది.
మరోవైపు రికవరీల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,56,250 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య కోటి 36 లక్షలకు పెరిగింది.
బ్రెజిల్
కరోనాతో బ్రెజిల్ విలవిల్లాడుతోంది. ఈ దేశంలో కొత్తగా 58 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 31 లక్షల 70 వేలకు ఎగబాకింది. అదే సమయంలో కొత్త కేసులకన్నా రికవరీలు అధికంగా ఉండటం కాస్త సానుకూలాంశంగా కనిపిస్తోంది. ఒక్కరోజులో 66,353 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు బ్రెజిల్లో కరోనా రికవరీల సంఖ్య 23 లక్షలకు చేరింది.
అగ్రరాజ్యంలో
అమెరికాలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. కొత్తగా 54 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. మొత్తం 53.60 లక్షల మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 1,386 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1.69 లక్షలకు చేరింది. 57 వేలకుపైగా బాధితులు కోలుకోగా.. మొత్తం రికవరీలు 27 లక్షలకు చేరాయి.
రష్యాలో కరోనా కేసుల సంఖ్య 9 లక్షలకు చేరింది. కొత్తగా 5 వేల కేసులు నమోదయ్యాయి. 129 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 15,260కి పెరిగింది.
మరో 259 మంది బాధితుల మృతితో దక్షిణాఫ్రికాలో కొవిడ్ మరణాలు 11 వేల మార్క్ దాటాయి. కొత్తగా 2,810 కేసులు గుర్తించగా.. మొత్తం బాధితుల సంఖ్య 5.68 లక్షలకు చేరింది.
మెక్సికోలో మరో 737 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 54,666కి చేరింది. కొత్తగా 5,858కేసులు నమోదుకాగా... మొత్తం బాధితుల సంఖ్య 4.98లక్షలకు ఎగబాకింది.
కొలంబియాలో కొత్తగా 12,066 కేసులు బయటబడ్డాయి. మరో 362 మంది మృతి చెందారు. దేశంలో కేసుల సంఖ్య 4.22 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 13,837కి పెరిగింది.
అర్జెంటీనాలో 7,663 కేసులను గుర్తించారు అధికారులు. 209 మంది మరణంచినట్లు వెల్లడించారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 2.68 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 5213గా ఉంది.