కరోనా ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు అన్ని అగ్ర దేశాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఒక కోటీ లక్షా 29 వేల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం 5 లక్షల 2 వేల మంది మృతిచెందారు. దాదాపు 55 లక్షల మంది కోలుకున్నారు.
రష్యాలో కొత్తగా 6,791 కేసులు..
రష్యాలో కరోనా తీవ్రతకు అడ్డుకట్టపడటం లేదు. దేశవ్యాప్తంగా మరో 6,791 మంది వైరస్ బాధితులుగా మారారు. ఇప్పటివరకు 6,34,437 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 104 మంది మహమ్మారి సోకి మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9 వేలు దాటింది.
పాక్‌లో 2 లక్షలకు పైగా..
పాకిస్థాన్‌లో తాజాగా మరో 4,072 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 2,02,955 మంది కరోనా బారినపడ్డారు. మరో 83 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,118కి చేరింది.
మొత్తం 77 జిల్లాలకు...
నేపాల్లోనూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఆ దేశంలోని మొత్తం 77 జిల్లాలకు వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో 463 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది. ఇప్పటివరకు 12 వేల 772 మంది కరోనా బారినపడ్డారు. 28 మంది మరణించారు.
- బ్రిటన్‌లో మళ్లీ లాక్డౌన్ విధించాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. అయితే కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు పెట్టనున్నారు. కరోనా ఉద్ధృతి గల ప్రాంతంలో భారత్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,11,739 బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు మహమ్మారికి 43,598 మంది బలయ్యారు.
- సింగపూర్‌లో గడచిన 24 గంటల్లో 213 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 202 మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
- చైనాలో మళ్లీ కరోనా పుంజుకుంటోంది. కొత్తగా మరో 17 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
- మెక్సికోలో కొత్తగా 4 వేల 410 మంది బాధితులను గుర్తించారు. మరో 602 మంది మృతి చెందారు.
- సౌదీ అరేబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం లక్షా 82 వేల 483 మందికి కరోనా సోకింది.
- బంగ్లాదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 3,809 మంది కరోనా బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 37 వేలకు చేరింది.
- దక్షిణ కొరియాలో కరోనా జయించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 62 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 26 మంది రాజధాని నగరం సియోల్ నుంచే ఉన్నారు.
- చెక్ రిపబ్లిక్లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 260 మంది వైరస్ సోకింది. మహమ్మారి సోకి 347 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 11 వేల మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
- దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 31 వేలకు చేరినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది.
ఇదీ చూడండి:తమిళనాడులో ఒక్కరోజే 3,940 మందికి కరోనా