ప్రపంచమంతా ఇప్పుడు డిజిటల్ మయం. ఒక్క రోజు చరవాణి వినియోగించకపోతే జీవితం గడవదనే పరిస్థితి. ముఖ్యంగా ఈ తరం చిన్నారుల్లో చాలా మంది చేతిలో ఫోన్లు లేకపోతే భోజనం కూడా చేయడం లేదు. మరి ఈ డిజిటల్ పరికరాల దుష్ప్రభావాల నుంచి వారిని రక్షించాలంటే? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొంది జర్మనీ. అదే... 'మీడియా స్కౌట్.'
జర్మనీలోని మూడింట రెండోవంతు చిన్నారులకు 11 ఏళ్లకే సొంత ఫోన్లు ఉన్నాయి. అలాంటి వారికి సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించడం ఈ మీడియా స్కౌట్ లక్ష్యం. విద్యా బోధనలో ఈ కార్యక్రమాన్ని ఒక భాగం చేశారు.
వాట్సప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో ఎలాంటి సందేశాలు పంపొచ్చు...? ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేసినా, మెసేజ్‌లు పెట్టినా ఏం చేయాలి? సైబర్ వేధింపులను ఎదుర్కోవడం ఎలా? ఇలాంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది మీడియా స్కౌట్.