గల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికుల మరణాలపై సందేహం వ్యక్తం చేసిన ఇంటర్నెట్ బ్లాగర్ కియూ జిమింగ్కు 8 నెలల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది ప్రారంభంలో కియూను అరెస్టు చేయగా.. సోమవారం జైలు శిక్షను ఖరారు చేసింది జియాంగ్సు రాష్ట్రంలోని నన్జింగ్ న్యాయస్థానం. అంతేకాకుండా.. దేశంలోని ప్రధాన సామాజిక మాధ్యమ పోర్టల్లతో పాటు జాతీయ మీడియాలో పది రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.
తను చేసిన నేరాన్ని కియూ ఒప్పుకున్నాడని కోర్టు వెల్లడించింది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని అభ్యర్థించినందున తక్కువ శిక్ష విధించినట్లు స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం
భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికులను అవమాన పరిచారనే అభియోగాలపై అతడిపై కేసు నమోదు చేసింది చైనా. ఆ ఘటనలో కేవలం సాధారణ సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఉన్నతాధికారి ప్రాణాలతో బయటపడడాన్ని ఈ యువకుడు ప్రశ్నించినందుకే చైనా అధికారులు అతడిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది.
కియూ(38)కు అక్కడి సామాజిక మాధ్యమం 'వైబో'లో దాదాపు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లాబిషియాకియూ(Labixiaoqiu) తన ఖాతాను నడిపిస్తున్నాడు. గల్వాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేస్తూ అతడు రెండు పోస్టులు పెట్టాడు. 'గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణలో కమాండర్ స్థాయి అధికారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.. ఉన్నతాధికారి కావడం వల్లనే అతడు బతకగలిగాడు' అని తొలి పోస్టులో పేర్కొన్నాడు. అధికారులు వెల్లడించిన దానికంటే ఎక్కువ మంది చైనా సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చంటూ మరో పోస్టులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి-సైనిక మరణాలపై సందేహం- బ్లాగర్‌పై చైనా వేటు!
అప్పుడే క్షమాపణ
గల్వాన్ ఘర్షణలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఓ ఉన్నతాధికారికి తీవ్ర గాయాలు అయ్యాయని చైనా అధికారికంగా వెల్లడించిన తర్వాత కియూ జిమింగ్ ఈ విధంగా స్పందించాడు. అయితే, తన వ్యాఖ్యలపై మార్చి 1న క్షమాపణలు చెప్పాడు కియూ. అలాంటి పోస్టులు చేసినందుకు చింతిస్తున్నానని చైనా అధికారిక ఛానెల్ అయిన సీసీటీవీ బ్రాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి-'గల్వాన్' మృతులపై తొలిసారి చైనా ప్రకటన