హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంటు ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని జీ-7 సభ్యదేశాలు సూచించాయి. ఈ మేరకు అన్ని దేశాలు కలిపి ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి.
''హాంకాంగ్‌పై జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలని చూస్తున్న చైనా నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిర్ణయంతో నిబంధనలకు వ్యతిరేకంగా బీజింగ్ అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నట్లు అవుతుంది.''
-జీ-7 దేశాల సంయుక్త ప్రకటన
ఈ నిర్ణయం వల్ల హాంకాంగ్ వృద్ధి ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాయి సభ్య దేశాలు. బహిరంగ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు ఆ దేశాల విదేశాంగ మంత్రులు. హాంకాంగ్ వాసుల హక్కులు, స్వేచ్ఛను గౌరవించాలని తెలిపారు.