జీ-20 సదస్సులో.. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై చర్చించారు ఆయా దేశాధినేతలు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో.. కరోనాపై పోరులో జీ-20 దేశాలు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయనే దాని గురించి మాట్లాడారు. వైరస్ కట్టడి, వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీనే ప్రధాన అజెండాగా సాగిందీ సదస్సు.
ఎవరేమన్నారంటే..
''ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఈ జీ-20 సదస్సు నుంచి ఓ భరోసా కల్పిస్తూ సందేశాన్ని పంపాలి. ఇప్పటికే వైరస్ కోసం జీ-20 దేశాలు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. చాలా దేశాలు తమ సొంత టీకాని అభివృద్ధి చేసే దానిపై కూడా దృష్టి పెట్టాయి. సదస్సులో భాగమైన అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు నేరుగా ఔషధ సంస్థలతో చర్చలు జరిపాయి. తద్వారా వచ్చే ఏడాది నాటికి టీకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నా.''
-సల్మాన్,సౌదీ అరేబియా రాజు
''కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు త్వరలోనే పొందుతాం. ఈ సదస్సులో అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మరికొంత కాలం పనిచేయాలని ఉంది.''
-డొనాల్డ్ ట్రంప్,అమెరికా అధ్యక్షుడు