ఇజ్రాయెల్ బలగాలకు, గాజాలోని హమాస్ ఉగ్రవాదులకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలి తీర్మానం చేయాలని ఫ్రాన్స్ కోరినట్లు ఐరాసలోని చైనా రాయబారి తెలిపారు. ఈ మేరకు భద్రతా మండలి మూడో సమావేశంలో ఐరాసలోని ఫ్రాన్స్ రాయబారి నికోలస్ డి రివిరే తెలిపినట్లు ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడు ఝాంగ్ జున్ ధ్రువీకరించారు.
ఇప్పటికే.. ఇజ్రాయెల్, గాజాల మధ్య ఉద్రిక్తతలకు అంతం చేసే దిశగా తాము దౌత్యమార్గాల్లో ప్రయత్నిస్తున్నామని అమెరికా తెలిపింది. అందుకు కాల్పుల విరమణ అంశంపై భద్రతా మండలిలో తాము చేసే ప్రకటన సాయపడదని చెప్పింది. ఇజ్రాయెల్, గాజా ఉగ్రవాదులు కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో తీర్మానం చేయాలన్న చైనా, నార్వే, ట్యునీషియా ప్రతిపాదనను మరో 14 సభ్య దేశాలు మద్దతు తెలిపాయని దౌత్యవేత్తలు తెలిపారు. దీనిపై భద్రతామండలి అధికారిక ప్రకటన చేసేందుకు 15 సభ్యదేశాల మద్దతు అవసరమవుతుంది. అయితే.. తీర్మానం చేసేందుకు కనీసం 9 దేశాలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అందులో ఒక్క శాశ్వత సభ్యదేశం కూడా తిరస్కరించకూడదు. ఈ తరుణంలో అమెరికా తీసుకోనున్న నిర్ణయం కీలకంగా మారింది.
భయానక పరిస్థితులు..
ఇజ్రాయెల్, గాజాల మధ్య భయానక యుద్ధవాతావరణాన్ని తలపిస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల సమన్వయ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల కారణంగా 47,000 మంది పాలస్తీనియన్ల ఆచూకీ గల్లంతైందని తెలిపింది. ఇజ్రాయెల్‌పై గాజా ఉగ్రవాదులు 3,400 రాకెట్లను ప్రయోగించారని చెప్పింది. గాజాలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని, వైద్యం ఇతర సేవలకు అంతరాయం కలుగుతోందని వెల్లడించింది.