తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఫోర్త్ వేవ్​ ముప్పు తప్పదా? కేంద్రం వార్నింగ్ దేనికి సంకేతం? - who

Fourth wave of Covid-19: కరోనా మహమ్మారి మరోసారి విజృంభించనుందా? త్వరలోనే కొవిడ్‌ నాలుగోదశ భారత్‌పై విరుచుకుపడనుందా? ఇప్పుడే అప్రమత్తం కాకపోతే వైరస్‌ కారణంగా మరోసారి భారీ నష్టం తప్పదా..? చైనా, ఇజ్రాయెల్‌లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌లు.. ప్రపంచ దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే..అవుననే సమాధానాలు వినిపిస్తున్నా యి. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ.. కేంద్రం, రాష్ట్రాలకు సూచించడం నాలుగోదశ రానుందనే వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది.

covid fourth wave
కొవిడ్​ నాల్గో వేవ్

By

Published : Mar 18, 2022, 2:02 PM IST

Fourth wave of Covid-19: ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ కొన్ని దేశాల్లో జడలు విప్పుతోంది. ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కొత్త కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్‌ ఎండమిక్‌ దశకు చేరుకుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో నూతన వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల చైనాలో కొత్తగా..స్టెల్త్‌ బీఏ2 వేరియంట్‌ బయటపడింది. దీంతో అక్కడ రోజురోజుకు పాజిటివ్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. వైరస్‌ కట్టడికి డ్రాగన్‌ సర్కారు.. పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. ఈ స్టెల్త్‌ ఒమిక్రాన్‌ అత్యధిక ప్రమాదకరమైన వేరియంట్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ కంటే అతి వేగంగా వ్యాపిస్తుందని గుర్తించారు. వైరస్‌ గుర్తింపు కూడా కష్టంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా ఇజ్రాయెల్‌లోనూ.. నూతన వేరియంట్‌ బయటపడింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో.. కరోనా కొత్త రకాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్‌ వేరియంట్లు బీఏ.1, బీఏ.2లు కలిసి.. ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు పేర్కొంది. ఈ వేరియంట్‌ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదని.. తమ దేశంలోనే పుట్టినట్లు భావిస్తున్నామని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ వివరించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు గత వారంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మార్చి 7 నుంచి 13 వరకు కోటి 10లక్షల కొత్త కేసులు, 43 వేల మరణాలు నమోదైనట్లు పేర్కొంది. కాబట్టి.. ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొత్త కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్‌.., దాని ఉపరకం బీఏ.2 అని కారణమని డబ్ల్యూహెచ్​ఓ వివరించింది. కరోనా నిబంధనల సవరించడం కూడా మరో కారణమని పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో.. కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదల, జీనోమ్‌ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగదల నేపథ్యంలో.. కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. వైరస్‌ నిర్ధరణ పరీక్షలు పెంచడం, ట్రాక్‌ చేయడం, చికిత్స, వ్యాక్సినేషన్‌, కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details