జపాన్ డైమండ్ ప్రిన్సెస్ నౌకలో తాజాగా మరో నలుగురు భారతీయులకు కరోనా సోకినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీరందరూ షిప్లో.. సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నలుగురితో కలిపి క్రూయిజ్ షిప్లో కరోనా బారిన పడ్డ భారతీయుల సంఖ్య 12కు చేరినట్లు ధ్రువీకరించింది.
జపాన్ నౌకలో మరో నలుగురు భారతీయులకు కరోనా - జపాన్ క్రూయిజ్ షిప్
జపాన్ క్రూయిజ్ షిప్లో తాజాగా నలుగురు భారతీయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఇప్పటివరకు వైరస్ సోకిన భారతీయుల సంఖ్య 12కు చేరింది.
రెండు వారాల నిర్బంధ కాలం ముగిసిన అనంతరం.. వైరస్ లక్షణాలు లేని కొంతమంది ప్రయాణికులను నౌక నుంచి గతవారమే తరలించారు. మిగతా వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల్లో ఎనిమిది మంది భారతీయులకు కొవిడ్-19 ఉన్నట్లు గుర్తించారు.
క్రూయిజ్ షిప్లో ఆరుగురు ప్రయాణికులు, 132 మంది సిబ్బంది కలిపి మొత్తం 138 మంది భారతీయులు ఉన్నారు. గత నెలలో హాంగ్‌కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి వైరస్ సోకడం వల్ల టోక్యో సమీపంలోని యొకోహమా పోర్టు వద్ద ఓడను నిలిపేశారు.