నాలుగు దశాబ్దాల పోరు..'లీపు' రోజున కొలిక్కి..! - సోవియట్ యూనియన్ సేనలు
అమెరికా- తాలిబన్ల శాంతి ఒప్పందంతో నాలుగు దశాబ్దాల నాటి హింసకు లీపు రోజున విముక్తి లభించింది. ఈ సందర్భంగా అసలు అఫ్గాన్ యుద్ధానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం!
నాటి సోవియట్ యూనియన్ సేనలు 1979 క్రిస్మస్ రోజున అఫ్గానిస్థాన్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి గత 40 ఏళ్లుగా అక్కడ హింస రాజ్యమేలుతునే ఉంది. నాటి అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు బాబ్రక్ కర్మల్ (కమ్యూనిస్టు పార్టీ) ఆహ్వానం మేరకు వస్తున్నామంటూ ప్రవేశించిన సోవియట్ సేనలు పదేళ్ల పాటు తిష్టవేశాయి. ముజాహదీన్ల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. అనంతరం వివిధ కారణాలతో వచ్చిన అమెరికా దళాలతో అంతులేని పోరు కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలకడానికే 'లీపు రోజు'న ఒప్పందం కుదిరింది.
- 1979 డిసెంబరు 25: నాటి సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ ఆక్సస్ నదిని దాటి అఫ్గానిస్థాన్‌లో ప్రవేశం. పాకిస్థాన్‌లో అఫ్గాన్ ముజాహిదీన్ల సమావేశం.
- 1980: కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలంటూ ముజాహిదీన్లను కోరిన అమెరికా. పాక్ నియంత జియా ఉల్ హక్ సాయంతో ఆర్థిక, ఆయుధ సహకారం అందజేత.
- 1983: ముజాహిదీన్ నాయకులతో అమెరికా అధ్యక్షుడు రీగన్ భేటీ. స్వాతంత్య్ర సమరయోధులంటూ ప్రశంస.
- 1986 సెప్టెంబరు: భుజాలపై తీసుకొని వెళ్లే విమాన విధ్వంసక స్టింగర్ క్షిపణులను ముజాహిదీన్లకు అందజేసిన అమెరికా.
- 1987 జనవరి: ప్రభుత్వంలో చేరాలని అఫ్గాన్ అధ్యక్షుడు (కమ్యూనిస్టు పార్టీ) నజీబుల్లా చేసిన ఆహ్వానాన్ని తిరిస్కరించిన ముజాహిదీన్లు.
- 1989 ఫిబ్రవరి: పదేళ్ల సోవియట్ ఆక్రమణకు ముగింపు. తిరిగి వెళ్లిన రెడ్ ఆర్మీ సైనికులు.
- 1992 ఏప్రిల్: నజీబుల్లా దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్న ముజాహిదీన్లు.
- 1992 సెప్టెంబరు: నజీబుల్లాను బహిరంగంగా విద్యుత్తు స్తంభానికి ఉరితీసిన ముజాహిదీన్లు.
- 1992-1996: ముజాహిదీన్లలోని ఏడు వర్గాల ‘యుద్ధ ప్రభువులు’ ఆధ్వర్యంలో ప్రాంతాల వారీగా సాగిన పాలన.
- 1994: తాలిబన్లుగా ఒక వర్గం అవతరణ.
- 1996: దేశమంతటా ఆధిపత్యం సంపాదించిన తాలిబన్లు.
- 1996-2001: ముల్లా మహమ్మద్ ఒమర్ ఆధ్వర్యంలో కఠిన నిబంధనలు అమలు చేసిన తాలిబన్లు.
- 2001 సెప్టెంబరు 21: ఉగ్రవాద శిక్షణ శిబిరాలను తొలగించాలని ముల్లా ఒమర్‌ను హెచ్చరించిన అమెరికా.
- 2001 అక్టోబరు 7: అఫ్గాన్‌ను ఆక్రమించిన అమెరికా, నాటో దళాలు.
- 2001 డిసెంబరు 5: అమెరికా, అఫ్గాన్ యుద్ధ ప్రభువులు జర్మనీలోని బాన్‌లో సమావేశమై అధికార పంపిణీ ఒప్పందం చేసుకున్నారు.
- 2001డిసెంబరు 7: తీవ్రమైన యుద్ధం కారణంగా కాంద్‌హార్‌ను వీడి వెళ్లిన ముల్లా ఒమర్. అధికారికంగా తాలిబన్ల పాలన అంతం.
- 2014: వెనక్కి మళ్లిన నాటో దళాలు. తాలిబన్లు, అల్ ఖైదాపై దాడులు జరపాలని సైనికులను ఆదేశించిన ఒబామా.
- 2015-18: అమెరికా దళాలు, తాలిబన్ల మధ్య రోజూ పోరాటం.
- 2018 సెప్టెంబరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాలిబన్లతో చర్చలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యత్నం.
- 2019 సెప్టెంబరు 9: కాబూల్‌లో అమెరికా సైనికుడిని హతమార్చినందుకు నిరసనగా తాలిబన్లతో చర్చలు రద్దు చేసిన ట్రంప్.
- 2019 నవంబరు 24: అఫ్గాన్ వెళ్లి అమెరికా సైనికులకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్. తాలిబన్లతో ఒప్పందం చేసుకుంటామని వెల్లడి.