తెలంగాణ

telangana

ETV Bharat / international

లద్దాఖ్​లో శాంతిని నెలకొల్పడం ఎలా? - india china meet in russia

మాస్కో వేదికగా చైనా విదేశాంగ మంత్రితో, భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌ భేటీ అయ్యారు. భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరో వైపు... రష్యా-భారత్‌-చైనా (రిక్‌) త్రైపాక్షిక సమావేశం కూడా జరిగింది.

Foreign ministers of Russia, India, China meet in Moscow
లద్దాఖ్​లో శాంతి నెలకొల్పడం ఎలా?

By

Published : Sep 11, 2020, 6:51 AM IST

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో... ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. రష్యా రాజధాని మాస్కోలో గురువారం భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ మంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించింది. వారు ఏయే అంశాలపై చర్చించారన్నది అధికారికంగా వెల్లడి కానప్పటికీ... ప్రధానంగా లద్దాఖ్‌లో పాంగాంగ్‌ సరస్సు కేంద్రంగా నెలకొన్న ఉద్రిక్తతలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.

రష్యా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య శాంతి వికసించవచ్చని... లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ మాత్రం... సమస్య పరిష్కారానికి ఇదే చివరి అవకాశమని, ఉభయ దేశాలు ఒక అంగీకారానికి రాకుంటే మాత్రం అది ‘ప్రమాదకర సంకేతమే’ అవుతుందని పేర్కొంది. భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు వద్ద ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. సుమారు నాలుగు నెలలుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న క్రమంలో... ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావడం విశేషం. ఈ విషయమై విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవను విలేకరులు ప్రశ్నించగా- ‘‘లద్దాఖ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే భారత్‌ వైఖరి. గతవారం రక్షణ మంత్రుల స్థాయి సమావేశంలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదిరింది. దౌత్య, సైనిక మార్గాల ద్వారా రెండు దేశాలు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా గత శుక్రవారం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చైనా మంత్రి వీ ఫెంగ్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం అంత ఫలప్రదంగా జరగలేదని అభిప్రాయపడుతున్నారు.

త్రైపాక్షిక సమావేశం

మరోవైపు... రష్యా-భారత్‌-చైనా (రిక్‌) త్రైపాక్షిక సమావేశం జరిగింది. చైనా, రష్యాల విదేశాంగ మంత్రులతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నట్టు జయ్‌శంకర్‌ వెల్లడించారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను ఈ సందర్భంగా వారు చర్చించినట్టు సమాచారం. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జయ్‌శంకర్‌ విడిగా భేటీ అయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక అంశాలు; అణు, అంతరిక్ష రంగాల్లో సహకారంపై వారిద్దరూ చర్చించారు. ఐరాస భద్రతా మండలిలో ఉభయ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. గతేడాది సెప్టెంబరులో ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరం (ఈఈఎఫ్‌) సమావేశం నిమిత్తం ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన సందర్భంగా చర్చించిన అంశాలపై పురోగతిని వారిద్దరూ సమీక్షించారు.

ద్వైపాక్షిక సంబంధాలు, షాంగై కో-ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌, బ్రిక్స్‌, ఐరాస తదితర అంతర్జాతీయ వేదికల్లో భారత్‌తో కలిసి ముందుకెళ్లే విషయమై చర్చించాం’’ అని లావ్‌రోవ్‌ పేర్కొన్నారు. భారత్‌-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ఏడాది 20 ఏళ్ల మార్కును చేరుకోనున్న తరుణంలో మంత్రులిద్దరూ సమావేశం కావడం విశేషం.మరోవైపు... ఉజ్బెకిస్థాన్‌ విదేశాంగ మంత్రి అబ్దులాజిజ్‌ కమిలోవ్‌, కజక్‌స్థాన్‌ మంత్రి ముఖ్తార్‌ తిలెబెర్దితోనూ జయ్‌శంకర్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, శాంతి, అభివృద్ధి భాగస్వామ్యం తదితర అంశాలపై వారితో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. షాంగై కో-ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో పాల్గొన్న జయ్‌శంకర్‌... చైనా మంత్రి వాంగ్‌ యీ, పాకిస్థాన్‌ విదేశాంగమంత్రి మహమూద్‌ ఖురేషి సహా పలువురు మంత్రులతో కూడిన గ్రూప్‌ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను సమావేశంలో వారు చర్చించారు.

ఇదీ చదవండి: చైనీయులపై కన్నేసిన భారత్​.. ఆ శిఖరాలన్నీ మనవే!

ABOUT THE AUTHOR

...view details