అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవటం చైనాకు కలిసొచ్చేలానే ఉంది. ఇప్పటికే ఆ దేశంలో అరుదైన ఖనిజసంపదపై కన్నేసిన డ్రాగన్.. త్వరలో వాటిని అత్యంత సులభంగా తన దేశంలోకి తరలించుకు పోవచ్చు! ఇందుకు వీలుగా అఫ్గాన్ సరిహద్దు ప్రావిన్స్ బదక్షాన్‌లోని నజాక్ ప్రాంతంలో 50 కిలోమీటర్ల రహదారి సిద్ధమవుతోంది. దీని నిర్మాణాన్ని 2020లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ప్రారంభించటం విశేషం. ఇప్పటికే 20 శాతం పని పూర్తయింది. మిగిలిన 80 శాతం పూర్తయితే బదక్షాన్ నుంచి చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్‌కు రాకపోకలు సులభమవుతాయి.
అఫ్గానిస్థాన్‌లో దొరికే అరుదైన 'రేర్‌ఎర్త్' ఖనిజాలపై కన్నేసిన చైనాకు ఈ రహదారి వరం కానుంది. కంప్యూటర్లు, రీఛార్జబుల్ బ్యాటరీలు, పవన్ విద్యుత్, టర్బయిన్లు, హైబ్రీడ్ కార్ల తయారీలో ఈ ఖనిజాలు చాలా కీలకం. ఈ విషయంలో ఇప్పటికే అఫ్గాన్‌తో చైనా కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంది.