మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఉద్యమిస్తున్న పౌరులను హింసించాలని అక్కడి పోలీసులకు సైనిక సర్కారు ఆదేశాలు జారీ చేస్తోంది. సైన్యం ఆదేశాలను ధిక్కరించిన ఇద్దరు మయన్మార్ పోలీస్ అధికారులు శరణార్థులుగా భారత్‌కు వచ్చి సాయం కోరుతున్నారు. మిజోరంలో ఆశ్రయం పొందుతున్న ఆ అధికారులు మయన్మార్‌లో పౌరులపై జరుగుతున్న దాడుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అందుకే వచ్చాం..
మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్న వారిని కాల్చి వేయాలన్న సైన్యం ఆదేశాలను ధిక్కరించిన ఇద్దరు పోలీసు అధికారులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. తిరిగి వెళ్లడం ఇష్టంలేని తమకు మానవతా దృక్పథంతో భారత్‌లో ఆశ్రయం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. మయన్మార్‌లో సైన్యం సాధారణ పౌరులపై చేస్తున్న అరాచకాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఎక్కడ ప్రజలు ఆందోళనలు చేసినా వారిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టాలని సైనిక ప్రభుత్వం తమను ఆదేశించిందని పేర్కొన్నారు. అమాయక ప్రజలను హింసించడం ఇష్టం లేకే కుటుంబంతో సహా దేశం వదిలి వచ్చినట్లు మయన్మార్ పోలీసు అధికారులు వివరించారు.
ప్రస్తుతం మిజోరంలోని ఓ గ్రామంలో ఈ ఇద్దరు పోలీసు అధికారులు ఆశ్రయం పొందుతున్నారు. కుటుంబాలతో కలిసి క్షేమంగా ఉన్నారు. స్థానికులు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని చెప్పారు. దేశాన్ని వదిలి రావడం బాధగా ఉన్నా తప్పలేదని వాపోయారు.
"మయన్మార్ పోలీస్ అధికారి సైనిక పాలనలో కనీసం నిద్ర పోయే సమయం కూడా మాకు లేదు. ఎప్పుడూ ఏ ఆదేశాలు సైన్యం ఇస్తుందో అని కలవరపడే వాళ్లం. ఆందోళనలు జరిగినప్పుడల్లా మమ్మల్ని ముందు వైపునకు పంపించి సైన్యం వెనుక ఉండేది. ఆందోళనకారులను అరెస్టు చేసి హింసించాలని సైన్యం మమ్మల్ని ఆదేశించేది. పౌరులను హింసించడం ఇష్టంలేని మాకు దేశం విడిచి రావడం తప్ప మరో మార్గం కనిపించలేదు."