చైనా లియానింగ్ ప్రావిన్సులో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. జనాలపైకి తన కారుతో దూసుకువచ్చాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగింది?
దాలియన్ నగరంలో రోడ్డు దాటుతున్న ప్రజలను శనివారం అర్ధరాత్రి సమయంలో.. సెడాన్ కారు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారని ప్రభుత్వ వార్తాసంస్థ 'జిన్హువా' కథనం తెలిపింది. క్షతగాత్రులైన మరో ఐదుగురు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పింది.
ఈ కేసులో కారు డ్రైవర్ లియుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో అతడు.. మత్తుపదార్థాలను సేవించలేదని చెప్పారు. కావాలనే ప్రజలకు హాని తలపెట్టే విధంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చైనాలో ఇటీవలి సంవత్సరాల్లో పౌరులపై ఆకస్మిక దాడులు జరగటం సర్వసాధారణంగా మారింది.