అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తలుపుతడుతుందో ఎవ్వరికీ తెలియదు. యెమెన్‌లోని 35మంది జాలర్లకూ అదే జరిగింది. ఎప్పటిలానే చేపల వేటకు వెళ్లిన వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారారు. తమ జీవితంలో ఊహించని ఈ పరిణామంతో వారంతో ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఏం జరిగిందంటే..
పశ్చిమ యెమెన్‌కు చెందిన 35మంది జాలర్లు రోజూలానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. చనిపోయిన ఓ స్పెర్మ్ తిమింగలం వారి పడవకు ఎదురుపడింది. ఆ భారీ కాయాన్ని కోసి చూసిన వారికి దాని కడుపులో విలువైన పదార్థం 'యాంబర్గ్రీస్' లభించింది. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్లి విలువ ఎంత ఉంటుందనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. రూ. 10కోట్లు వరకు ధర పలుకుతుందని వ్యాపారులు చేప్పారు. దీంతో జాలర్లంతా ఉబ్బితబ్బిబైపోయారు.
యాంబర్ గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్ఫ్యూమ్ తయారీలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక్క కిలో యాంబర్గ్రీస్కు రూ.కోట్లలో ధర ఉంటుందంటే దాని విలువేంటో అర్థం చేసుకోవచ్చు.
తమకు వచ్చే రూ.10కోట్లను అందరం సమానంగా పంచుకుంటామని జాలర్లు చెప్పారు. అందులో కొంత డబ్బును తమకు తెలిసినవారికి సాయం చేసేందుకు ఉపయోగిస్తామని మంచి మనసు చాటుకున్నారు. తనకు వాటాగా వచ్చిన డబ్బుతో ఓ మంచి ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకుంటానని ఓ జాలరి ఆనందంగా చెప్పాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.