కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా పరిశోధకులు కీలక పురోగతి సాధించారు. మానవులపై మొదటి దశ ట్రయల్స్ ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, వైరస్‌ను నిలువరించగల రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
108 మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు. కరోనా వైరస్‌పై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడమే కాక, రోగనిరోధక వ్యవస్థలోని టీ-సెల్స్ ప్రతిస్పందించినట్లు తేల్చారు. అయితే సార్స్-కొవ్-2 వైరస్ బారి నుంచి ఈ వాక్సిన్ రక్షిస్తుందో లేదో నిర్ధరించేందుకు మరింత పరిశోధన జరగాల్సి ఉందని బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
108 మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించిన 28 రోజుల అనంతరం మంచి ఫలితాలు వచ్చాయని, 6 నెలల్లోగా తుది ఫలితాలు విశ్లేషించాల్సి ఉంటుందని పరిశోధకులు వివరించారు.