తెలంగాణ

telangana

ETV Bharat / international

నాన్నలూ... మీ పిల్లల కోసం కాస్త సెలవులు తీసుకోండి!

పిల్లలతో సమయం గడపాలని ఏ తండ్రి అనుకోడు చెప్పండి. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో తీరికే ఉండట్లేదు. ధనార్జనే లక్ష్యంగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉద్యోగ జీవితంలో ఇదీ మరీ ఎక్కువ. సెలవుల్లేక పితృత్వం ఆనందాన్ని అనుభవించలేక అల్లాడుతుంటారు కొందరు. కానీ.. బాగా అభివృద్ధి చెందిన ఓ దేశంలో సంతానం కలిగినప్పుడు తండ్రులకు దాదాపు సంవత్సరం పాటు పితృత్వ సెలవులకు అవకాశమున్నా.. వినియోగించుకునేది తక్కువేనట. ఇంతకీ అంతలా సెలవులు ఇచ్చేది ఏ దేశం? ఇచ్చినా ఎందుకు తీసుకోవడంలేదు?

Few men in Japan take paternity leave.
నాన్నలూ... మీ పిల్లల కోసం కాస్త సెలవులు తీసుకోండి!

By

Published : Jun 1, 2020, 6:12 PM IST

జపాన్​.. బాగా అభివృద్ధి చెందిన దేశం. కొత్త కొత్త ఆవిష్కరణల్లో ముందుండే దేశం. అత్యాధునిక టెక్నాలజీలను పరిచయం చేసిన దేశం. అయితేనేం.. అభివృద్ధిలో ప్రపంచస్థాయిలో అగ్రభాగాన ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం వెనుకే. పని ఒత్తిడిలో పడి.. వ్యక్తిగత జీవితాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారట అక్కడి ప్రజలు.

అవును.. ప్రస్తుత ఉద్యోగ జీవితంలో కుటుంబంతో సరిగా గడపలేక, పిల్లల్ని చూసుకోలేక తండ్రితనానికి దూరమై ఎందరో వేదనకు గురవుతున్నారు.

పిల్లలతో అలా అలా

ఉద్యోగం చేసే పురుషుడు తండ్రయితే సెలవులిచ్చే దేశాల్ని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయితే.. జపాన్​లో మాత్రం విచిత్రం. పితృత్వ సెలవు(పెటర్నటీ లీవ్​) రోజులూ, నెలలూ కాదు, ఏకంగా సంవత్సరం ఇస్తారంట. అయినా ఏం లాభం వినియోగించుకోనప్పుడు!

తండ్రితో కలిసి బయటకు వెళ్లడంలో ఆనందమే వేరు

ఉద్యోగ జీవితం, ఆర్థిక సమస్యలు, కార్పొరేట్​ సంస్కృతికి అలవాటు పడ్డ ఆ దేశీయులు సెలవులు తీసుకోవడానికే జంకుతున్నారట. కారణాలు లేకపోలేదు. సరైన అవగాహన లేకపోవడం ఒకటైతే... ఆదాయవనరులు తగ్గడం, ఉద్యోగంలో ప్రత్యామ్నాయాలు లేకపోవడం ఇతరత్రా ఆటంకాలు.

13 శాతమైనా..!

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేవలం 6 శాతం పురుషులే పితృత్వ సెలవుల ప్రయోజనాల్ని పొందారు. అందులోనూ 70 శాతానికిపైగా 2 వారాల కంటే తక్కువే సెలవులు తీసుకున్నారు. ఈ సంఖ్యను కనీసం 13 శాతానికైనా తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పితృత్వ సెలవు తీసుకొనేలా జపనీయుల్ని ప్రోత్సహించేందుకు అక్కడ కొన్ని సంస్థలు కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి. సెలవులు తీసుకోండంటూ బతిమాలుతున్నాయి. అందులో ఒకటి 'ఫాదరింగ్​ జపాన్​'.

తండ్రుల వైఖరిలో మార్పు రావాలని అంటున్నారు ముగ్గురు పిల్లలకు తండ్రయిన 'ఫాదరింగ్​ జపాన్' సంస్థ​ డైరెక్టర్ మనాబు సుకగోషీ. ​

మనాబు సుకగోషీ

''ఇప్పటి తండ్రులకు వారి తల్లిదండ్రులే రోల్​మోడల్స్. కానీ.. ఆ రోల్​ మోడల్స్ 20,30 ఏళ్ల క్రితం వారు. అందుకే.. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం ప్రస్తుత జీవనశైలికి నప్పదు. అప్పట్లో వారికి పెటర్నటీ లీవ్​ అంటే ఏంటో తెలియదు. వారే తీసుకోలేదు. వాళ్ల భార్యలూ.. సెలవు తీసుకుని ఇంట్లో ఉండమని అడగలేదు. మహిళలకు వారి భాగస్వాములపై అంచనాలు తక్కువగా ఉంటాయి.''

- మనాబు సుకగోషీ, ఫాదరింగ్​ జపాన్​ డైరెక్టర్​

ప్రభుత్వ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం.. జపాన్​లో తండ్రులు రోజులో సగటున గంట మాత్రమే పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు వెచ్చిస్తున్నారని తేలింది.

పిల్లలతో బయటకు వచ్చిన జపనీస్​ జంట
పిల్లలతో గడుపుతున్న జపనీస్​ జంట

జపాన్​ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ శాఖతో అనుసంధానమై పనిచేసే ఫాదరింగ్​ జపాన్​... అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తోంది. ఎక్కువ మంది ప్రయోజనాలు పొందేలా మార్గదర్శకాలు జారీచేస్తూ ప్రోత్సాహం అందిస్తోంది. అయినా పెద్దగా మార్పులు కనిపించట్లేదు.

'ఇప్పుడా అనుభూతి పొందుతున్నా'

టోక్యోలోని ఓ పరిశ్రమలో పనిచేసే కంజీరో ఒగావా గతేడాది మేలో తండ్రయ్యాడు. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం పెద్ద సవాలేనని అంటున్నాడు. అందుకే పితృత్వ సెలవుల్ని తొలి దశలో 4 రోజులకే పరిమితం చేసుకున్నాడు.

ఒగావా కుటుంబం
కుమారుడికి తినిపిస్తున్న ఆర్కిటెక్ట్​

''నేను నా పిల్లలకు ప్రతిదీ నా చేతుల మీదుగా చేయాలనుకుంటా. కానీ.. స్నానం చేయించడం, నిద్రపుచ్చడం, ఆడించడం వంటివి చేయాలనుకున్న ప్రతిసారీ.. కష్టంగానే అనిపిస్తోంది. స్నానం చేయించాలని ప్రయత్నించినా కష్టంగా గడిచింది. ఈ విషయంలో ఇప్పటికీ నేను ఒకింత గందరగోళానికి గురవుతూనే ఉంటా.''

- ఒగావా, ఓ తయారీ పరిశ్రమలో ఉద్యోగి

ఒగావా

ఒగావాకు క్రమంగా విషయం అర్థమైంది. అందుకే రెండో దఫాగా 6 నెలలు పితృత్వ సెలవు తీసుకున్నాడు. తొలుత సరైన అవగాహన లేదని.. ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ పూర్తి తండ్రిదనాన్ని ఆస్వాదిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశాడు.

కుమారుడి సంరక్షణలో ఒగావా

ఉద్యోగమే ఒత్తిడి..

జపాన్​.. ఉద్యోగుల సెలవు నిబంధనలు విషయంలో ప్రపంచంలో మెరుగైన స్థానంలో ఉంది. కొత్తగా తండ్రైన ఉద్యోగి.. వేతనాల్లో కోతతో ఏడాది సెలవు తీసుకునేందుకు అర్హుడు. కానీ వారివారి ఉద్యోగాల రీత్యా ఒత్తిడి, ఆర్థిక భారం, కార్పొరేట్​ కల్చర్​ ఇతరత్రా సమస్యలు.. కుటుంబ బాధ్యతల కంటే పనే ముఖ్యం అనే భావన కలిగేలా చేస్తాయి. ఆ ఊబిలోకి బలవంతంగా నెట్టేస్తాయి.

పిల్లలతో కష్టమే..!

టోక్యోలో పనిచేసే ఆర్కిటెక్ట్​ డైగో హిరాగాకు ఐదేళ్ల కొడుకు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే.. పని ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతో సమయం గడపడం కష్టంగా ఉందని అంటున్నాడు. చిన్న కంపెనీ ఉద్యోగి అయిన హిరాగా.. తనకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాడు.

ఆర్కిటెక్ట్​ హిరాగా

''నాలాగా చిన్న కంపెనీల్లో పనిచేసేవారికి అదనంగా ప్రత్యేకంగా బాధ్యతలుంటాయి. ఒకవేళ నేను వెళ్లకపోతే నా స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయం దొరకడం కష్టం. కాబట్టి నేను పితృత్వ సెలవు తీసుకోవడం చిన్న విషయమేమీ కాదు. ''

- ఆర్కిటెక్ట్​ హిరాగా

ఈ సమస్యలన్నింటినీ పరిగణించి.. తండ్రులు వారి సెలవుల ప్రయోజనాల్ని వినియోగించేలా చేసేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు మనాబు. ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకురావాలని అంటున్నారు.

''ఇటీవల కార్మిక చట్టంలో చేసిన సంస్కరణల్ని చూస్తే.. అదనపు పనిగంటల్ని పరిమితం చేసింది. వేతనంతో కూడిన సెలవుల్ని తీసుకోవాలని ఒత్తిడి పెంచుతోంది. ఇది మరింత ప్రభావవంతంగా మారాలి. యాజమాన్యాలను హెచ్చరించనంత వరకు ఆ 70 శాతం తండ్రుల వైఖరిలో మార్పు రాదు. ''

-మనాబు, ఫాదరింగ్​ జపాన్​ డైరెక్టర్​

జపాన్​ పర్యావరణ మంత్రి షింజిరో కోయిజుమి.. ఈ జనవరిలో తండ్రి అయిన అనంతరం పితృత్వ సెలవు తీసుకున్నారు. ఇలా ఈ పెటర్నటీ లీవ్​ ప్రయోజనాల్ని వినియోగించుకున్న మొట్టమొదటి కేబినెట్​ మంత్రి ఈయనే కావడం విశేషం. ఈ షింజిరో మార్గంలోనే మిగతా జపనీయులూ నడవాలని ఆశిస్తోంది 'ఫాదరింగ్​ జపాన్'. మిగతా తండ్రులూ ఆయన బాటలో పయనిస్తారో లేదో తెలియదు కానీ.. పితృత్వ సెలవులపై ఉద్యోగుల్లో అవగాహనకు ఇదొక మంచి పునాది అని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details