ఖతార్‌లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతుంటాయి. ఇక రోడ్ల పరిస్థితైతే చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పులు లేకుండా రోడ్డు మీద కాళ్లు పెడితే నిమిషాల్లోనే బొబ్బలు వస్తాయి. నల్లరంగు అధికంగా వేడిని గ్రహిస్తుంది. అందుకే ముఖ్యంగా వేసవిలో నల్లని రోడ్ల వల్ల వాహనాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. వాటిలో ఉండే ప్లాస్టిక్ భాగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. టైర్లు తొందరగా అరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే ఓ ప్రత్యేక పదార్థంతో తయారైన నీలిరంగు రోడ్లను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
ఖతార్ రాజధాని దోహాలో పైలట్ ప్రాజెక్టుగా నీలి రంగు రహదారి ముందు దోహాలో..
ఖతార్ రాజధాని దోహాలో పైలట్ ప్రాజెక్టుగా నీలి రంగు ఉపరితలం ఉన్న రోడ్ల పనితీరును పరిశీలిస్తున్నారు. నల్లని రోడ్లతో పోల్చుకుంటే ఈ నీలి రంగు రహదారులు సూర్యకాంతిని తక్కువగా పీల్చుకుంటున్నాయి. చాలా వరకు కాంతిని పరావర్తనం చెందించడమే దీనికి కారణం. ఫలితంగా ఈ రోడ్లు ఎక్కువగా వేడెక్కడం లేదు. నీలి రంగు వల్ల రోడ్డు ఉష్ణోగ్రత 10 నుంచి 20 డిగ్రీల వరకు తగ్గుతోంది. ఈ ప్రభావం చుట్టుపక్కల పరిసరాల మీద కూడా ఉంటోంది. మరిన్ని పరీక్షల తర్వాత ఫలితాలను బట్టి ఈ నీలి రోడ్లను ఖతార్ మొత్తం విస్తరిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:రెండోసారి కరోనాను జయించిన 104 ఏళ్ల బామ్మ