అందరు ఆడపిల్లల్లాగే హాయిగా చదువుకోవాలనుకుంది.. మంచి డాక్టరై సేవ చేయాలనుకుంది.. అమ్మానాన్న, భర్త, పిల్లలు... అందరితో ఆనందంగా జీవితాన్ని గడిపేయాలనుకుంది. కానీ... ఆమె ఓ రాజకీయనాయకురాలైంది. ప్రతికూల శక్తులతో పెనుపోరాటం చేయాల్సి వచ్చింది. అందునా... ఛాందసవాద భావజాలంతో ఆమె యుద్ధమే చేస్తోంది. ఆ క్రమంలో ఆమె అనుకున్న దిశగా ఒక్కో అడుగు ముందుకేసింది. కరుడుకట్టిన తాలిబన్ ఆంక్షల నుంచి అఫ్గాన్ మహిళలకు నిజంగానే వరాలనే అందించింది. తాలిబన్ ఉగ్రవాదులతో జరుగుతున్న శాంతిచర్చల్లో ఆమె ప్రముఖ పాత్ర వహిస్తోంది.. ఆమె పేరు ఫాజియా కూఫీ...
ఎదురీది గెలిచింది..
ఎదురీదడం.. ఇది విజేతలకు మాత్రమే వచ్చిన అరుదైన కళ. ఈ కళలో పండిపోయినవారు ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా వెన్నుచూపరు.. విజయం వారికి దాసోహం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తుంటారు. ఫాజియా కూడా అంతే. అఫ్గానిస్థాన్‌లోని ఉన్నత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి రష్యా మద్దతు ఉన్న ప్రభుత్వంలో ఎంపీగా 25ఏళ్లపాటు పనిచేశాడు. అలాని ఆమె జీవితం సాఫీగా సాగిపోలేదు. ఆడపిల్ల పుడితే తనను భర్త పట్టించుకోడనే భయంతో ఆమె తల్లి ఫాజియాను ఎర్రటి ఎండలో వదిలేసింది. కానీ కన్నపేగు కదా... మళ్లీ అక్కున చేర్చుకుంది. అలా తిరస్కారాల నుంచి కూడా అనుకున్నది సాధించుకునే తత్వం ఫాజియాకు ఈ సంఘటనతోనే మొదలయ్యిందేమో!
అన్నలతోపాటు సమానంగా తనూ బడికి వెళతానని అడిగినప్పుడు ఆ తల్లి గుండె అంతాఇంతా భయపడలేదు. కానీ ఫాజియా మాయచేసింది. కేవలం ప్రాథమిక పాఠశాల చదువుతో ఆపేయలేదు.. వైద్యవిద్యలో చేరింది. అంతవరకూ బాగానే ఉన్నా... ఆ దేశాన్ని మతఛాందసంతో నిండిన తాలిబన్లు ఆక్రమించారు. దాంతో కూఫీ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. మహిళలు చదువుకోవడంపై నిషేధం విధించారు. అసలు మహిళలు బయటకు రాలేని పరిస్థితి. ఆ తర్వాత అమెరికా సేనలు రంగంలోకి దిగడంతో అఫ్గానిస్థాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో కూఫీ మరోసారి పుస్తకం చేత పట్టింది. కాబూల్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతిశాస్త్రంలో పట్టా పుచ్చుకొంది. కొంతకాలం పాటు యునిసెఫ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసింది.
ఆ తెగువకే అవార్డు వచ్చింది..