భారత్, చైనా సరిహద్దులో (India China news) శాంతి పునరుద్ధరణకు ఈశాన్య లద్ధాఖ్ ప్రాంతం నుంచి చైనా బలగాల ఉపసంహరణలో పురోగతి అవసరమని విదేశి వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ (S. Jaishankar) పునరుద్ఘాటించారు. దుషన్‌బే వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో(SCO Summit) పాల్గొనేందుకు తజకిస్తాన్ వెళ్లిన జైశంకర్ అక్కడ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దులో బలగాల తొలగింపు అంశంపై వాంగ్‌యీతో చర్చించినట్లు ట్విట్టర్ వేదికగా జైశంకర్ వెల్లడించారు.
సైనిక బలగాల ఉపసంహరణలో పురోగతి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. భారత్ ఎప్పటికీ ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చదని జైశంకర్(S. Jaishankar) స్పష్టం చేశారు. ప్రపంచ పరిణామాలపై ఇరుదేశాల అభిప్రాయాలను ఈ సమావేశంలో పంచుకున్నట్లు జైశంకర్ తెలిపారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలపై (Afghan news) చర్చించినట్లు వివరించారు. తూర్పు లద్ధాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో గత ఏడాది మే 5న హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. అప్పటి నుంచి ఇరుదేశాలు సరిహద్దు వెంట సైనిక బలగాలను విస్తరించాయి.