వియాత్నాం ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ తూర్పు ఆసియా దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. వర్చువల్గా జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించారు. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్ ఫ్యూక్.. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అన్ని సభ్యదేశాలూ ఇందులో పాల్గొన్నాయి.
ఈ సదస్సులో ఇండో-పసిఫిక్ గురించి ప్రస్తావించారు జైశంకర్. ఇందులో పది దేశాలు కేంద్రీకృతమై.. సముద్ర ప్రాంతంపై ఆసక్తి కనబర్చడం గురించి మాట్లాడారు. అయితే.. దక్షిణ చైనా సముద్రం పట్ల ఏకపక్ష వైఖరి ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ అంశంపై చైనానుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండటం సహా.. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక దేశాలు ఇటీవల ప్రకటించిన విధానాలను స్వాగతిస్తున్నామని చెప్పారు.