కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్... కరోనా కట్టడికి అతి కీలకమని ఓ పరిశోధన ద్వారా తేలింది. ఎంత వేగంగా ఈ ప్రక్రియ చేపడితే కరోనా వ్యాప్తిని అంత త్వరగా అడ్డుకోవచ్చని ఆ నివేదిక స్పష్టంచేసింది.
చైనా షెంఝెన్లోని హార్బిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ అధ్యయనం చేసింది. ఈ పరిశోధన లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ జర్నల్లో ప్రచురితమైంది. 391 కేసులపై అధ్యయనం చేసిన పరిశోధకులు.. వారితో సన్నిహితంగా ఉన్న 1,286 మందిని పరిశీలించారు.
షెంఝెన్ మోడల్..
కాంటాక్ట్ ట్రేసింగ్ వల్ల షెంఝెన్లో 4 వారాల్లో సామాజిక వ్యాప్తిని నియంత్రించగలిగినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే వీరిని గుర్తించే క్రమంలో కొన్ని సవాళ్లు తప్పవని హెచ్చరించారు పరిశోధకులు. సన్నిహితులను పరీక్షించే క్రమంలో లక్షణాలు కనిపించని వారివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.
"కాంటాక్ట్ ట్రేసింగ్ వేగం పెరిగే కొద్దీ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య సగటు 5.5 నుంచి 3.2కు దిగివచ్చింది. ఎవరిని అనుమానితులుగా గుర్తించి వేరు చేయాలన్న విషయంలో అధికారులకు స్పష్టత వచ్చింది. వేగంగా పరీక్షలు నిర్వహించటం వల్ల షెంఝెన్లో వైరస్ వ్యాప్తిని నియంత్రణ సాధ్యమైంది."