భయపడినట్టే జరిగింది. అఫ్గానిస్థాన్‌లోని కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల వరుస దాడులు (kabul airport explosion) జరిగాయి. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది ఎయిర్పోర్ట్ బయట వేచిచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా, ఈ ఘటనల్లో 13 మంది మరణించారని తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని చెప్పారు. కాగా, గాయాలతో సుమారు 60 మంది ఆసుపత్రిలో చేరినట్లు కాబుల్ లోని ఎమర్జెన్సీ ఆస్పత్రి వెల్లడించింది.
తొలుత విమానాశ్రయం గేటు వద్ద పేలుడు జరిగిందని.. ఈ ఘటనలో అమెరికా సైనికులతో పాటు పౌరులు మరణించారని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ తెలిపారు. అబే గేటుకు సమీపంలోని బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరిగిందని వెల్లడించారు.
ఇస్లామిక్ స్టేట్ హస్తం!
అయితే ఈ దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ హస్తం ఉందని బలంగా నమ్ముతున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. తాలిబన్ల కన్నా తీవ్రవాదులైన ఐఎస్ బృందం పౌరులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించారు.
గత కొన్ని గంటల్లో భీకర పేలుళ్లలతో కాబుల్ విమానాశ్రయం వద్ద పరిస్థితి దారుణంగా దిగజారిందని అన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. అఫ్గాన్‌లోని ఫ్రెంచ్ రాయబారి ప్యారిస్ తిరిగి వచ్చేస్తున్నట్లు తెలిపారు. మరి కొన్ని వందల మంది అఫ్గానీలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తుందని హామీఇచ్చారు.
ఉదయం నుంచి భయంభయంగా..
అఫ్గానిస్థాన్‌ను వీడి పరాయి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నడూ చూడని రద్దీ కనిపిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాలు తీవ్ర హెచ్చరికలు చేశాయి. ఎయిర్పోర్ట్ వద్ద దాడులు జరిగే ప్రమాదముందని, అక్కడ ఉండడం సురక్షితం కాదని ప్రజలకు సూచించాయి.
అయినా... ఉదయం నుంచి కాబుల్ ఎయిర్పోర్ట్ వద్దకు ప్రజలు పోటెత్తుతున్నారు. తమను దేశం దాటించాలంటూ(kabul airport evacuation) అక్కడ ఉన్న అమెరికా బలగాలను వేడుకుంటున్నారు. ఓ దశలో ఎయిర్పోర్ట్ వద్ద రద్దీ ఎక్కువై... ఉద్రిక్తతలకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించాల్సి వచ్చింది.
కాసేపటికే ఎయిర్పోర్ట్ వద్ద పేలుడు జరిగింది.
ఇదీ చదవండి:కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత- వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం