కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా.. వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలపై వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయనేది తాజా వివాదం. ఈ నేపథ్యంలోనే చైనా.. ఈక్వెడార్ సంస్థ నుంచి దిగుమతి చేసుకుంటున్న రొయ్యల దిగుమతిపై వారం పాటు నిషేధం విధించింది. మరిన్ని సంస్థలపైనా తాత్కాలిక ఆంక్షలకు పూనుకుంది.
ఓవైపు పరిశోధకులు.. అట్టపెట్టెలు, ప్లాస్టిక్ కంటైనర్లపై కొన్ని గంటల పాటు వైరస్ ఉంటుందని చెబుతున్నా.. ఇది ఎంత ప్రమాదకరమైందన్న అంశంపై స్పష్టతనివ్వట్లేదు. మరోవైపు మహమ్మారికి సంబంధించిన ఇతర విషయాల్లానే ఈ అంశం కూడా రాజకీయ వస్తువుగా మారిపోతోంది.
దిగుమతుల నిషేధాల నేపథ్యంలో యూఎస్ సహా ఇతర దేశాలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ప్రజారోగ్యమే తమకు అన్నింటికన్నా ముఖ్యమంటోంది. చైనా వాదనలు ఎలా ఉన్నా.. ఆహార ప్యాకేజీలపై ఉన్న వైరస్ ప్రజలపై అంత ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం లేదంటున్నారు నిపుణులు.
అయితే, ఈ వివాదం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది.
చైనా కొత్త పాట..
మొట్టమొదటిసారి కరోనా వైరస్.. చైనాలోని మాంసం మార్కెట్లోనే వెలుగుచూసింది. వూహాన్ వైరస్ విధ్వంసం మరువకముందే.. జూన్‌లోనూ మరోసారి బీజింగ్ మాంసం మార్కెట్లో వైరస్ ప్రబలింది. ఈ నేపథ్యంలో మాంసం ద్వారానే కరోనా కాష్ఠం మొదలైందని అందరూ విశ్వసించటం మొదలుపెట్టారు. ఇది చైనా మాంసం విక్రయాలపై భారీగానే ప్రభావం చూపించింది. చైనా వివిధ రకాల మాంసాహార ఉత్పత్తులను దాదాపు 24 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం చాలా సూపర్మార్కెట్లు దిగుమతైన మాంసంపై 'వైరస్ ఫ్రీ' అనే స్టిక్కర్లు అంటిస్తున్నారు.
ప్రస్తుత వాదనలో చైనా.. సరకు రవాణా చేసేవారిలో వ్యాధికారకాలు ఉండటం వల్లే ప్యాకేజింగ్‌పై వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెబుతోంది. అయితే, ఈ మాంసం ప్యాకెట్లపై వైరస్ ఎలా వచ్చిందనే అంశాన్ని అధికారికంగా తేల్చాల్సి ఉంది.
అంతర్జాతీయ ఆగ్రహం..
చైనా ఆగడాలపై ప్రపంచదేశాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చైనా నిషేధాలు బాట పడుతుండటం వివిధ దేశాలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. యూఎస్ సహా.. న్యూజిల్యాండ్, కెనడా, ఐరోపా దేశాలు చైనా విధానాలపై మండిపడుతున్నాయి. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇంటువంటి చర్యలకు దిగటంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
చైనా నిషేధం.. ఎంతవరకు శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా ఉందో చెప్పాలని అమెరికా ప్రశ్నించింది. ఈ తరహా ఆంక్షలు స్వేచ్ఛా వాణిజ్యానికి అవరోధంగా మారతాయని హెచ్చరించింది. అయితే, చైనా.. అమెరికా వాదనలను తిప్పికొట్టింది.
ప్రజల ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమనే సూత్రానికి కట్టుబడి ఉన్నాం. వాణిజ్యం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేం.
-చైనా విదేశాంగ శాఖ
ఈ వివాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది.