అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అగ్రరాజ్య రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న ఆయన.. పరిపాలన విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో బైడెన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? భారత ఉపఖండంలో అమెరికా విదేశీ నీతిలో ఏదైనా మార్పు వస్తుందా? పాకిస్థాన్ పట్ల బైడెన్ తీరు ఎలా ఉండబోతోంది? అనేవి చర్చనీయాంశాలయ్యాయి.
బైడెన్‌పై పాక్ ఆశలు!
'పాకిస్థాన్ బైడెన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అఫ్గానిస్థాన్‌పై తమ పంథానే అమెరికన్లు అనుసరిస్తారని పాకిస్థాన్ ఆశిస్తోంది. అలాగైతే వాషింగ్టన్‌లో తమ మాటకు విలువ పెరుగుతుందని దాయాది దేశం భావిస్తోంది. అలాగే భారత్‌లో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల పట్ల, ముఖ్యంగా జమ్ముకశ్మీర్ పరిణామాలపై ఎన్నికల ప్రచారంలో బైడెన్, ఇతర డెమొక్రటిక్ నేతలు చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తే.. బైడెన్ హయాంలో భారత్ మీద కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ అంశాలు పాకిస్థాన్‌కు ఊరట కలిగించేవే. దక్షిణ ఆసియాపై అమెరికా విదేశాంగ విధానంలో పాకిస్థాన్ తిరిగి కేంద్రబిందువు అయ్యేందుకు జమ్ముకశ్మీర్, అఫ్గాన్ విషయాలు దోహదం చేస్తాయని పాకిస్థాన్ భావిస్తోంది' అని పాకిస్థాన్ వ్యవహారాల నిపుణుడు, సీనియర్ రిసర్చ్ ఫెలో సుశాంత్ సరీన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా విషయానికి వస్తే.. బైడెన్ ప్రభుత్వ విధానాలు కచ్చితంగా ఎలా ఉండబోతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అఫ్ఘానిస్థాన్‌ను అనాథగా వదిలేస్తుందా? అంటే.. అలా చేస్తే పరిణామాలు ఒక విధంగా ఉంటాయి. రెండో అవకాశం ఏమిటంటే, తాలిబన్ నుంచి ఆ దేశాన్ని కాపాడేందుకు అక్కడ తన పట్టును ద్విగుణీకృతం చేయడం. 'ఇలా చేస్తే, పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి. ఈ విషయంలో బైడెన్ ప్రభుత్వం ఏం చేయబోతోందో స్పష్టంగా తెలిసే వరకు అఫ్గాన్ విషయంలో ఊహించడం కష్టం' అని సుశాంత్ సరీన్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే అఫ్గాన్‌లో అమెరికా సైనికులను పాకిస్థాన్ చంపేస్తున్నా లేదా వారిని హతమార్చడంలో ఆ దేశ హస్తం ఉన్నా.. అక్కడ అమెరికా చేస్తున్న పోరాటానికి తూట్లు పొడుస్తున్నా సరే.. 20 ఏళ్లుగా దాయాది దేశం మెడలు వంచలేకపోయారు అమెరికా పాలకులు. ఈ విషయాన్ని పాక్- భారత్ ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది. అలాగే పాకిస్థాన్ వాదానికి సుముఖంగా మారేలా భారత్ మీద అమెరికన్లు ఒత్తిడి తెస్తారనుకోవడం కూడా భ్రమే అవుతుంది.
"పశ్చిమ దేశాల్లో మతిలేని ఉదారవాదుల గొణగుడును భారత్ పట్టించుకోనవసరం లేదు. అమెరికా-పాకిస్థాన్ ఆర్థిక సంబంధాల విషయానికి వస్తే.. వాణిజ్యం విషయంలో పాకిస్థాన్ లెక్కలోనిది కాదు. అమెరికా ఆర్థిక సాయం కూడా గొప్పగా పెరిగేది ఉండదు. ఇప్పటిలానే ఇకముందూ అడపాదడపా కొద్దోగొప్పా చిల్లర విదుల్చుతుంది."
-సుశాంత్ సరీన్, పాకిస్థాన్ వ్యవహారాల నిపుణుడు
అఫ్గానిస్థాన్‌లో యుద్ధం నేపథ్యంగానే గడచిన 20 ఏళ్లుగా, అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు రూపుదిద్దుకున్నాయి. ఈ పరిస్థితి మారుతుందోన్న అంచనా దృష్ట్యా ఉభయ దేశాల పరస్పర భౌగోళిక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ప్రాతిపదికగా.. వాషింగ్టన్‌తో ఇస్లామాబాద్ నెలకొల్పుకోదలచిన సరికొత్త భాగస్వామ్యానికి శ్వేతసౌధంలో బైడెన్ ప్రతిష్ఠాపన ఎలా ఉపకరించగలదో వేచి చూడాలంటున్నారు సరీన్.