అఫ్గానిస్థాన్ భయానకంగా (Afghan crisis) మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు. కాబుల్ విమానాశ్రయంపై (Kabul airport blast) జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 108కు పెరిగింది. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కాగా.. 95 మంది అఫ్గాన్ వాసులు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ విషయాన్ని కాబుల్ అధికారులు వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకుంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.
తృటిలో తప్పించుకున్న సిక్కులు, హిందువులు!
గురువారం జరిగిన జంట పేలుళ్ల నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందే దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు సిక్కు వర్గానికి చెందిన కొందరు తెలిపారు. వీరిలో 145 మంది సిక్కులు.. మరో 15 మంది హిందువులు. వీరంతా అఫ్గాన్‌ను విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలోకి వెళ్లడం కోసం సరిగ్గా పేలుళ్లు జరిగిన ప్రాంతంలోనే కొన్ని గంటల పాటు వేచి చూసినట్లు పేర్కొన్నారు.
పాక్ నుంచి తాలిబన్లు చాలా నేర్చుకున్నారు..
అఫ్గాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఈ ఘటనపై స్పందించారు. 'తాలిబన్లు- హక్కానీ నెట్‌వర్క్‌ల్లో ఐసిస్-కె మూలాలు ఉన్నాయి. కానీ తాలిబన్లు దీనిని తిరస్కరించడం ఎలా ఉందంటే.. ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్ సంస్థతో సంబంధాలు లేవని పాక్ చెప్పినట్లుంది. తన గురువు నుంచి తాలిబన్లు చాలా నేర్చుకొన్నారు' అని ఆయన ట్వీట్ చేశారు.
మరిన్ని దాడులు జరగొచ్చు..!