ఈ పుడమి గాలి నేల నీరు మన పిల్లల నుంచి రుణంగా తీసుకొన్నవేగాని, మనకవి తాత ముత్తాతల వారసత్వం కాదు. కనుక మనకెలా అవి దక్కాయో కనీసం వాటిని అలాగే రేపటి తరానికి అప్పగించాలి’- మహాత్మాగాంధీ మహితోక్తి అది. ఆ బాధ్యతను విస్మరించి ఆర్థిక ప్రగతి పేరిట మితిమీరిన కర్బన ఉద్గారాలతో పర్యావరణ విధ్వంసానికి తెగబడి, పెను వాతావరణ మార్పులకు అంటుకట్టి, భూమండలాన్నే నిత్యాగ్నిగుండంగా మార్చేసిన నేరగాళ్లను భావితరం నేడు సూటిగా నిలదీస్తోంది. ‘సమస్త పర్యావరణ వ్యవస్థలూ కుప్పకూలి సర్వనాశనానికి ఆరంభ దశలో ఉన్నా’యంటూ ‘ఇంకా కట్టుకథలతో పొద్దుపుచ్చడానికి మీకు ఎంత ధైర్యం?’ అన్న పర్యావరణవేత్త గ్రెటా థున్‌బర్గ్‌తో భావితరం బలంగా గళం కలుపుతున్న వేళ స్వీడన్‌లోని మాడ్రిడ్‌లో ‘కాప్ 25’ విశ్వసదస్సు జరిగింది.
ఒరిగిందేమీ లేదు
2015 నాటి ప్యారిస్ ఒప్పందాన్ని పూర్తిగా అమలులోకి తెచ్చే విధివిధానాల నిర్ధారణ, కర్బన ఉద్గారాల స్వయంనియంత్రణ లక్ష్యాల్ని అన్ని దేశాలూ మరింత పెంచేలా చూడాలన్న ధ్యేయంతో పద్నాలుగు రోజులపాటు జరిగిన సదస్సు ఎలాంటి ఫలితం సాధించకుండానే చాప చుట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కర్బన ఉద్గారాల తలసరి సగటు 1.3 టన్నులు. అదే అమెరికా తలసరి సగటు నాలుగున్నర టన్నులు. చైనా 1.9, ఐరోపా సంఘం 1.8. అయితే ఇండియా వాటా కేవలం అర టన్ను! నిరుడు విశ్వవ్యాప్తంగా కర్బన ఉద్గారాల్లో చైనా 28 శాతం, అమెరికా 15, ఈయూ తొమ్మిది, ఇండియా ఏడు శాతం వాటా కలిగిఉన్నాయని, మొత్తం 59 శాతానికి అవే పుణ్యం కట్టుకొన్నాయని సమితి గణాంకాలు ఎలుగెత్తుతున్నాయి. నెల రోజుల క్రితం ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా అధికారికంగా వైదొలగినందున స్వీయ నియంత్రణ లక్ష్యాల పెంపుదలపై చైనా, ఇండియాల మీద సహజంగానే ఒత్తిడి పెరిగింది. ప్యారిస్ ఒప్పంద పరిధిలో అందరికన్నా మిన్నగా ఫలితాలు చూపిస్తున్న ఇండియా- అదనపు మోతలకు తలొగ్గకపోవడం, పేద దేశాల వాణిని పెద్ద దేశాలు పెడచెవిన పెట్టడం వల్ల ఉత్తుత్తి ఆశాభావ ప్రకటనలకే సదస్సు పరిమితమైంది!
మానవాళికే పెనుశాపం
మనిషి సహా సమస్త జీవావరణాన్ని పొత్తిళ్లలో పాపలా సాకిన పర్యావరణం, వాతావరణ మార్పుల దరిమిలా మానవాళితో చేస్తున్నది అక్షరాలా ప్రత్యక్ష రణం. ప్రగతి పేరిట ప్రకృతి సమతూకాన్ని దెబ్బతీసి, బొగ్గుపులుసు వాయు ఉద్గారాల అగ్గితో భూతాపం రాజేసి పారిశ్రామిక దేశాలు చేసిన పాపం మానవాళికే పెనుశాపంగా మారడమే విషాదం. సమితి ప్రధాన కార్యదర్శి కోరుతున్నట్లు కర్బన ఉద్గార తటస్థత (నెట్ జీరో) సాధించేందుకు 28 దేశాల ఈయూ సన్నద్ధత చాటింది. ఆ విధంగా ఇండియా, చైనాలపై ఒత్తిడి పెంచే యత్నం సాగినా- 2005నాటి క్యోటో ప్రొటోకాల్‌కు అభివృద్ధి చెందిన దేశాల కట్టుబాటే ప్యారిస్ ఒడంబడిక సాఫల్యానికి సరైన ప్రాతిపదిక అవుతుందంటూ బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా సంయుక్తంగా ప్రకటించాయి.