అఫ్గానిస్థాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నప్పటికీ.. పంజ్‌షేర్ లోయ(panjshir valley news) చెక్కుచెదరకుండా నిలిచింది. ఘన చరిత్ర, పోరాట యోధుల కథలతో ఇప్పుడు ఈ ప్రాంతం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఎలాగైనా పంజ్‌షేర్‌ను తమ వశం చేసుకోవాలని తాలిబన్లు అక్కడ పాగా వేశారు. ఏం జరుగుతుందోనని ప్రజలు పంజ్‌షేర్ సింహాలవైపు చూస్తున్నారు. అయితే.. ఈసారి తాలిబన్ ఫైటర్ల(Taliban news) ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి!
రాజీపడాల్సిందే!
ఇన్నాళ్లు పంజ్‌షేర్ బలగాలను ముందుండి నడిపించిన నేత, పంజ్‌షేర్ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్.. ఇటీవలే ఓ ప్రకటన చేశారు. తాలిబన్లకు తలొగ్గేది లేదని.. వారిని ఎదుర్కొనేందుకు తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని తేల్చిచెప్పారు. అయితే.. ఆయన ప్రస్తుతం తాలిబన్లతో రాజీకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయుధాలు ఉన్నా.. ఇతర వనరులు, ముఖ్యంగా ప్రపంచ దేశాల మద్దతు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
"తాలిబన్లతో పంజ్‌షేర్ పోరాడలేదు. తాలిబన్లు తమ సంఖ్యను పెంచుకుంటున్నారు. వారితో పోరాడటానికి ఇది 1980ల నాటి కాలం కాదు. తాలిబన్లు శక్తిమంతులుగా మారారు," అని మసూద్ సలహాదారుడు చెప్పినట్టు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ కథనం ప్రచురించింది. తమకు సహాయం కావాలని ఫ్రాన్స్, ఐరోపా, అమెరికా, అరబ్ దేశాలను అహ్మద్ మసూద్ కోరినప్పటికీ ఫలితం లేదని అయన సలహాదారుడు వెల్లడించారు.