దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు (Bangladesh Temple Attack) గుర్తు తెలియని ఛాందసవాదులు. ఈ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో బుధవారం నలుగురు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. హింసను అరికట్టేందుకు 22 జిల్లాల్లో పారామిలటరీ దళాలను గురువారం మోహరించింది ఆ దేశ ప్రభుత్వం.
కూమిల్లా నగరంలోని స్థానిక ఆలయాన్ని ధ్వంసం (Hindu Temple Vandalised) చేశారనే వార్తలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
పోలీసులతో ఘర్షణ..!
ఈ క్రమంలో ఛాందసవాదులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు చనిపోగా, గాయాల కారణంగా అనంతరం మరొకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిగిన హాజిగంజ్లో ర్యాలీపై అధికారులు నిషేధం విధించారు. అధికారులపై దుండగులు దాడికి పాల్పడ్డారని, తమ వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. పోలీసుల చర్యల కారణంగా మరణాలు సంభవించాయా అనే దానిపై వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే 500 మందికి పైగా ఉన్న జనసమూహంలోకి పోలీసులు కాల్పులు జరిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.