పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు డిసెంబర్ 17న ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. పెషావర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేఠ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. రాజ్యాంగ అవహేళన, దేశద్రోహం నేరాల కింద ఈ తీర్పునిచ్చింది.
రెండు రోజుల తర్వాత పూర్తిస్థాయి 167 పేజీల తీర్పును విడుదల చేసింది కోర్టు. జస్టిస్ సేఠ్ రాసిన ఈ తీర్పులో పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అనేక అంశాలు చేర్చారు.
"ఒక వ్యక్తి ఒంటరిగా ఇంతటి తీవ్రమైన నేరానికి పాల్పడటం నమ్మశక్యం కాదు. ప్రతి విషయంలో సైనికులు, కమాండర్లు అతనికి అండగా, ప్రతి చర్యనూ సమర్థిస్తూ వచ్చారు. దోషితో పాటు అతనికి సాయం చేసిన వారి పాత్ర కూడా సమానంగా ఉంది."
-తీర్పు
2016 నుంచి విదేశాల్లో ఉన్న ముషారఫ్‌కు మరణ శిక్ష అమలు చేసే అవకాశం కనిపించట్లేదు. అయినప్పటికీ ఈ తీర్పు పాక్ పౌర-సైన్య సంబంధాలపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ అంశం రాజకీయ నాయకులతో ముడిపడి ఉంది. ఈ అవకాశంతోనైనా సైన్యం కబంధహస్తాల నుంచి నేతలు బయటపడేందుకు ప్రయత్నిస్తారో లేదో చూడాల్సి ఉంటుంది.
చరిత్ర చూస్తే...
ప్రత్యేక కోర్టు ఇప్పుడు రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి ఒక మార్గం చూపించింది. గతంలో అత్యవసర స్థితి పేరుతో దేశాన్ని సైన్యం చేతిలో పెట్టేందుకు పాక్ న్యాయస్థానాలు సహకరించాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల మంచి కోసమే రాజ్యాంగేతర అధికారం... ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకోవచ్చని ఈ సిద్ధాంతం పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను 1977లో సైన్యాధ్యక్షుడు జియా ఉల్ హక్ తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ముషారఫ్ దింపేసినప్పుడూ ఇలాగే స్పందించింది.
సైన్యానికి ఎదురుదెబ్బలు..
పాక్‌లో న్యాయవ్యవస్థ ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడింది. గత నెలలో సైన్యాధ్యక్షుడు జనరల్ భజ్వా పదవీకాలం పొడిగింపును సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ రెండు తీర్పులు ఒకేసారి రావటం.. పాక్ సైన్యం చట్టానికి అతీతం కాదని స్పష్టమైన సందేశం అందిస్తోంది.
ఈ పరిణామాలు పాక్ సైన్యానికి మింగుడు పడకపోవచ్చు. హుస్సేన్ హక్కానీ రాసిన పుస్తకం 'పాకిస్థాన్: బిట్వీన్ మాస్క్ అండ్ మిలిటరీ'లో ప్రొఫెసర్ అఖిల్ షా గురించి ప్రస్తావించారు. 2007-13 మధ్య వందమంది సైన్యాధికారులతో ఆయన మాట్లాడారు. సంక్షోభ సమయంలో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవటాన్ని 75 శాతం మంది సమర్థించినట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు జాతీయ భద్రతను సమర్థంగా నిర్వహించలేరనేది వారి అభిప్రాయమని వెల్లడించారు.
ఇంకా సైన్యం ఒత్తిడిలోనే...
జాతీయ విధానాల్లో ఆధిపత్యాన్ని వదులుకునేందుకు పాక్ సైన్యం ఎప్పటికీ ఒప్పుకోదు. అందుకే ముషారఫ్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వెంటనే ప్రజాసంబంధాల అంతర్గత సేవలు (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఖండించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది పాక్ సైన్యానికి దిగ్భ్రాంతిని కలిగించిందని, విచారకరమైన విషయమని ప్రకటన చేశారు. పూర్తి విచారణ జరపకముందే తొందరపాటులో తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో సైన్యానికి సంబంధించి ఇటువంటి ప్రకటన అసాధారణమైనది.
ప్రభుత్వ వైఫల్యమేనా..?
దురదృష్టవశాత్తు ఈ అవకాశంతో సైన్యం చేతుల్లోనుంచి బయటకు వచ్చేందుకు పాక్ రాజకీయ నాయకత్వం ప్రయత్నించలేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. గఫూర్ ప్రకటన తర్వాత పాక్ అటార్నీ జనరల్ మీడియా సమావేశం ఇందుకు బలం చేకూర్చుతోంది. పాక్ ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి ఉందని తెలిపేందుకు ఏజీ ప్రకటన ప్రత్యక్ష సాక్ష్యం.
"ముషారఫ్ దేశద్రోహం కేసులో రాజ్యాంగబద్ధంగా విచారణ సాగలేదు. న్యాయ విచారణ ఆర్టికల్ 10-ఏను అనుసరించి జరగలేదు. అందువల్ల ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు చట్ట విరుద్ధం. న్యాయమైన విచారణ జరగటమే కాదు, న్యాయంగానూ కనిపించాలి."
-పాక్ అటార్నీ జనరల్ ప్రకటన
ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తప్పకుండా అప్పీలు చేస్తారు. ఈ అంశంలో పాక్ రాజకీయ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. పాక్ ప్రభుత్వంపై సైన్యం ఆధిపత్యం ఒక్క రాత్రిలో పోయేది కాదు. కానీ తప్పును సరిదిద్దుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఇక్కడి నుంచే నేతలు ఓనమాలు దిద్దాలి. పౌర-సైన్య సంబంధాలను గాడిలో పెట్టాలి. అయితే ఆట మొదలు పెట్టాల్సింది మాత్రం ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
-భారత విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్, డీఎస్ హుడా
ఇదీ చూడండి: 'ముషారఫ్ శరీరాన్ని 3 రోజులు వేలాడదీయండి'