పాక్‌లోని ఇండియన్ ఎంబసీ వద్ద డ్రోన్ కలకలం - భారత్-పాకిస్థాన్ సంబంధాలు
13:12 July 02
భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం
జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ భవనంపై డ్రోన్ సంచరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ సంచారాన్ని.. ఉల్లంఘన చర్యగా అభివర్ణించింది.
గత ఆదివారం రెండు డ్రోన్లు జమ్ము వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భనవంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో భవనం పైకప్పునకు రంధ్రం పడింది. కాగా.. ఈ ఘటన జరిగిన తర్వాత జమ్ములోని సైనిక స్థావరాల వద్ద పలు డ్రోన్లు సంచరించాయి. భద్రతాబలగాలు అప్రమత్తమై కాల్పులు జరపడంతో అవి తప్పించుకున్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ నుంచి ఓ నిఘా డ్రోన్ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. అయితే బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో అది వెనుదిరిగింది.
సరిహద్దుల్లో ఆయుధాలను జారవిడిచేందుకు పాకిస్థాన్ డ్రోన్లను వినియోగిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 2019 ఆగస్టులో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ కూలిన డ్రోన్‌ను అధికారులు గుర్తించారు. పాక్ నుంచి ఉగ్రవాదులు డ్రగ్స్, ఆయుధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు భద్రతాసిబ్బంది తెలిపారు.