స్వయంచోదిక కార్ల అభివృద్ధిలో చైనా వేగంగా అడుగులు వేస్తోంది. డ్రైవర్ రహిత ట్యాక్సీలు ఆ దేశంలో పరుగులు పెడుతున్నాయి. చైనా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం బైడు సంస్థ రూపొందించిన 'అపోలో గో' టాక్సీలు మే మొదటి వారం నుంచి పశ్చిమ బీజింగ్‌లోని షౌగాంగ్ పార్క్ పట్టణంలో సేవలందిస్తున్నాయి. సుమారు మూడు కిమీ పరిధిలో పది 'అపోలో గో' టాక్సీలు నడుస్తున్నాయి. వీటిని మరింత విస్తరించేందుకు బైడు ప్రణాళికలు రూపొందిస్తోంది.
స్టార్ట్ ద జర్నీ..!
కారు లోపలికి ఎక్కగానే ప్రయాణికులు సీట్ బెల్టు పెట్టుకుని.. 'స్టార్ట్ ద జర్నీ' అనే బటన్‌పై క్లిక్ చేస్తే చాలు ప్రయాణం మొదలైనట్లే. అత్యాధునిక కెమెరాలు, లైడార్ సాంకేతికత, రియల్ టైమ్ సిగ్నల్స్‌తో ఈ ట్యాక్సీలు పనిచేస్తాయి. లేజర్ రాడార్లతో వాహనాలు, పాదచారులను గమనిస్తూ రైడ్ సాగుతుంటుంది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓ డ్రైవర్‌ను సైతం ఇందులో అందుబాటులో ఉంచుతోంది సంస్థ.
"ప్రస్తుత డెవలపర్లు ఇంటెలిజెంట్ కార్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అపోలో గో యాప్ ద్వారా ప్రజలు సులభంగా ప్రయాణిస్తున్నారు. టాక్సీలోకి ప్రవేశించే ముందు వారి గుర్తింపును ధ్రువీకరించడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది."
-జియా కే, చీఫ్ ఎడిటర్, ఆటో బిజినెస్ మ్యాగజైన్
బీజింగ్‌లో పాదచారులు ఎక్కువ.. జీబ్రా క్రాసింగ్లలో కదలికలూ ఎక్కువే. కాబట్టి డ్రైవర్‌లెస్ కార్ల పట్ల సహజంగానే కొంత ఆందోళన ఉందని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ సంస్థ అధినేత జాంగ్ బైడు తెలిపారు. రెండో, మూడో శ్రేణి నగరాల్లో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బుగాట్టి కార్, రఫేల్ మధ్య రేస్- గెలుపెవరిది?
"గతేడాది నుంచి ఖాళీ రోడ్లపై స్వయంప్రతిపత్తి డ్రైవింగ్‌ను బైడు పరీక్షిస్తోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'అపోలో గో' రోబోట్యాక్సీ ఇప్పటికే 2,10,000 మంది ప్రయాణికులను చేరవేసింది. రాబోయే మూడేళ్లలో 30 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. డ్రైవింగ్ ఆటోమేషన్ సిస్టమ్ పరంగా బైడు నాలుగో స్థానంలో ఉంది."