Dragon Fruit China: మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ దేశంలో కొవిడ్ కలకలం కొనసాగుతోంది. తాజాగా.. వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటున్న డ్రాగన్ ఫ్రూట్లు ఆ దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఆ పండుపై చైనా ఈనెల 26 వరకు నిషేధం విధించింది. అంతేకాదు సూపర్మార్కెట్లు మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
డ్రాగన్ ఫ్రూట్లో కరోనా!
వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్లో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు కొన్ని రోజుల క్రితం అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్‌పై జనవరి 26 వరకు నిషేధం విధించింది. వియత్నాం నుంచి డ్రాగన్‌ఫ్రూట్ దిగుమతిని రద్దు చేసింది. ఆ పండు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా కొనుగోలుదారులు క్వారంటైన్ అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
దేశంలోని జేజియాంగ్, జియాన్జి ప్రావిన్సుల్లోని కనీసం తొమ్మిది నగరాల్లో వియత్నాం డ్రాగన్ ఫ్రూట్లో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోని సూపర్మార్కెట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూసివేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి :చైనాలో అర్ధరాత్రి భూకంపం- ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..