ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని తొలుత గుర్తించిన చైనా వైద్యుడు గురువారం మృతిచెందారు. ఫిబ్రవరి 1న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చేరిన లీ వెన్‌లియాంగ్ గురువారం ఉదయం మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతిపట్ల చైనా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం లీ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.
సార్స్ తరహా వైరస్
నేత్రవైద్యుడైన లీ వెన్‌లియాంగ్ తనకు వద్దకు వచ్చిన ఓ రోగిలో డిసెంబరు 30న తొలిసారి కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. సార్స్ తరహా వైరస్ ఆనవాళ్లు గుర్తించానంటూ తన మిత్రులకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఆ సందేశం కాస్తా వైరల్ కావడంతో వైరస్ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొలుత అసత్య ప్రచారాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న నేరం కింద లీని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం తన మిత్రులకు మాత్రమే చెప్పాలనుకున్నానని.. ప్రజల్ని భయపెట్టడం తన ఉద్దేశం కాదని చెప్పినా వారు వినిపించుకోలేదు. అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత వదిలిపెట్టారు. తిరిగి ఆయన విధుల్లో చేరి వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు కృషి చేశారు. జనవరి రెండో వారంలో ఆయనకి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 1న ఐసీయూలో చేరి వైరస్‌తో పోరాడుతూనే ప్రాణాలు కోల్పోయారు. లీ అరెస్టుని సుప్రీం పీపుల్స్ కోర్టు సైతం తప్పుబట్టింది. అతను చెప్పిన విషయాన్ని వెంటనే విశ్వసించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని వ్యాఖ్యానించింది.