కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. అలాంటి పద్ధతి ఈ మధ్య భారత్‌లోనూ మొదలైంది. వివాహమై కొన్ని నెలలైనా గడవక ముందే చిన్న చిన్న విషయాలకే గొడవ పడి కోర్టుమెట్లు ఎక్కుతున్న జంటలు ఉన్నాయి. తమ మధ్య విభేదాలొచ్చి విడిపోవాలని కోరుకునే దంపతులకు అధికారికంగా విడాకులు తీసుకోవడానికి అన్ని దేశాల్లోనూ చట్టాలున్నాయి. కానీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడానికి వీలులేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. ఎందుకో తెలుసా?
మత విశ్వాసాలే కారణమా?
ఫిలిప్పీన్స్‌లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్లే ఉన్నారు. క్యాథలిక్ పద్ధతులను పాటించే వారు విడాకులను వ్యతిరేకిస్తుంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదు. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. విడాకుల చట్టాలు లేకపోవడం వల్ల అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేదు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించమని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడాన్ని అగౌరవంగా భావిస్తుంటారు. అందుకే పోప్ అభ్యర్థనను సైతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రపంచంలో విడాకులే లేని దేశం తమదని గర్వంగా చెప్పుకోవాలనేదే అక్కడి నేతల కోరిక.
మధ్యలో తెచ్చిన చట్టాలు మధ్యలోనే మాయం!
ఫిలిప్పీన్స్‌ను మొదట్లో స్పెయిన్ స్వాధీనం చేసుకొని కొన్ని శతాబ్దాలు పాలించింది. ఈ క్రమంలో ఆ దేశ ప్రజలు క్యాథలిక్ క్రైస్తవులుగా మారారు. దీంతో క్యాథలిక్ సంప్రదాయాలు, కట్టుబాట్లు వారిలో జీర్ణించుకుపోయాయి. అందుకే విడాకులు తీసుకోవడాన్ని వారు అగౌరవంగా భావిస్తారు. అధికారికంగా వారు విడిపోలేరు. కాబట్టి ఎవరైనా సరే.. భార్య/భర్త నుంచి విడిపోయి వేరుగా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా అలా విడిగా ఉంటే, వారిని నీచంగా చూస్తారు.