చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ వారాంతంలోనే అవి భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు పెద్దగా పట్టనట్లు వ్యవహరించిన చైనా.. తొలిసారి స్పందించింది. రాకెట్ శకలాలు భూమిని తాకే లోపలే అవి కాలిపోతాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తాము ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ఏప్రిల్ 29న కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నియంత్రణ కోల్పోగా అది భూమివైపు దూసుకొస్తోందని వెన్‌బిన్ తెలిపారు. అయితే, రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పటికే పూర్తిగా కాలిపోతుందని తెలిపారు. భూమిపై పడి నష్టం కలిగించడం అనేది దాదాపు జరగకపోవచ్చని చెప్పారు. సంబంధిత అథారిటీ ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అందిస్తుందని పేర్కొన్నారు.