పుట్టుకతోనే అతడికి అంగవైకల్యం.. మాట్లాడలేడు, నడవలేడు.. ఎవరైనా తినిపిస్తేనే తినే పరిస్థితి. మృత్యువు రూపంలో చిన్నప్పుడే తల్లి దూరమైనా నాన్నే అన్నీ తానై చూసుకుంటున్నాడు. అలాంటి కుటుంబాన్ని విధి మరోసారి వెక్కిరించింది. అండగా ఉంటున్న తండ్రిపై కరోనా పంజా విసిరింది. వైరస్ సోకి తండ్రి నిర్బంధంలో ఉండగా.. ఆకలితో అలమటించి ఆ కొడుకు మృత్యు ఒడికి చేరుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా చైనాలో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
చైనాలోని హుబి రాష్ట్రానికి చెందిన యాన్ జియోవెన్ దంపతుల పెద్ద కుమారుడు యాన్ చెంగ్ వయసు 17 ఏళ్లు. పుట్టుకతోనే సెరబ్రల్ పాల్సీ వ్యాధి రావడం వల్ల వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. చెంగ్ 11ఏళ్ల తమ్ముడు కూడా ఆటిజంతో బాధపడుతున్నాడు. కుమారులిద్దరూ అంగవైకల్యంతో పుట్టడం వల్ల మనస్తాపానికి గురైన జియోవెన్ భార్య పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి తండ్రి యాన్ జియోవెన్ అన్నీ తానై కొడుకులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు.
ఆకలితో అలకమటించే చనిపోయాడా?
ఇటీవల యాన్ జియోవెన్, తన రెండో కుమారుడితో కలిసి వుహాన్ వెళ్లొచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ అనారోగ్యానికి గురవడం వల్ల జనవరి 22న ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల తర్వాత వీరికి ప్రాణాంతక కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి జియోవెన్, ఆయన చిన్న కొడుకును ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్‌లో ఉంచారు.
అప్పటినుంచి యాన్ చెంగ్ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. కొడుకు పరిస్థితిని వివరిస్తూ జియోవెన్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. తన కుమారుడి ఆకలి తీర్చండంటూ బంధువులు, స్థానికులను అభ్యర్థించాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. తండ్రి ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి ఆహారం లేక జనవరి 29నే యాన్ చెంగ్ కన్నుమూశాడు. యాన్ మృతికి గల కారణాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించనప్పటికీ ఆకలితో అలమటించే అతడు చనిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
విధుల నుంచి తొలగింపు
అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ఇటీవల ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల హుబి రాష్ట్ర అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, హోంగన్ కౌంటీ మేయర్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.