తెలంగాణ

telangana

ETV Bharat / international

వైరస్​పై ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిందా? - కరోనా వైరస్​ చైనా

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు చైనాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా చైనాపై '5ఐస్'​ మండిపడింది. వైరస్​ వ్యాప్తిపై చైనా అబద్ధాలు చెప్పిందని విరుచుకుపడుతున్నాయి. అయితే ఆ దేశాల మాటల్లో నిజమెంత?

DID CHINA HID THE FACTS ABOUT CORONA VIRUS?
వైరస్​పై చైనా ప్రపంచాన్ని మభ్యపెట్టిందా?

By

Published : May 3, 2020, 7:59 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి చైనా వైఖరిపై ఐదు దేశాలు విరుచుకుపడుతున్నాయి. ఈ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదంటూ చైనా అబద్ధమాడిందని, వైరస్‌ వివరాల్ని ప్రపంచానికి చెప్పిన వేగుల్ని మాయం చేసిందని మండిపడుతున్నాయి. ‘5 ఐస్‌(కళ్లు)’గా పిలుచుకునే అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల కూటమి ఈ మేరకు ఒక రహస్య నివేదికను సిద్ధంచేసింది. దీని ఆధారంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై విమర్శలు చేశారు. ఇంతకీ వీరి ఆరోపణలకు దన్నుగా నిలుస్తున్న సాక్ష్యాలేమిటి? వాటిని బలపరిచే ఆధారాల్ని అవి ఎక్కడ్నుంచి, ఎలా సేకరించాయి? వైరస్‌ వ్యాప్తి తొలినాళ్లలో చైనాలో ఏం జరిగింది? అది ప్రపంచానికి ఏం చెప్పింది? అందులో నిజానిజాలేమి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘5 ఐస్‌ కళ్ల కూటమి’ నివేదిక సమాధానాలు ఇస్తోంది. బ్రిటన్‌కు చెందిన ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక ప్రచురించిన నివేదికలోని అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నివేదికలో ఏముందంటే...

  • వుహాన్‌ సముద్ర జీవుల మార్కెట్‌ నుంచి వైరస్‌ వ్యాపించిందని చైనా చెప్పడం పచ్చి అబద్ధం. అది అక్కడి పీ4 ప్రయోగశాల నుంచి బయటికి వచ్చింది. నిజం బయటపడకుండా చైనా అధికారులు ప్రయోగశాలలోని నమూనాలను నాశనం చేశారు. వుహాన్‌ మార్కెట్‌ను పూర్తిగా బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రంచేశారు.
  • కరోనా వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదంటూ చైనా పెద్ద అబద్ధమాడింది. తైవాన్‌ వంటి సరిహద్దు దేశాలు ఖండిస్తున్నా... జనవరి ఆఖరు వరకు డబ్ల్యూహెచ్‌వో సైతం చైనానే వెనకేసుకొచ్చింది. ఇది అంతర్జాతీయ పారదర్శకతను దెబ్బతీయడమే.
  • కరోనా వివరాలను ప్రపంచానికి చెప్పిన ప్రజా వేగుల(విజిల్‌ బ్లోయర్‌)ను మాయంచేసింది. విమర్శకుల నోళ్లు మూయించింది.
  • చైనాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని, వైరస్‌ గురించి తెలిపే సమాచారాన్ని ఇంటర్నెట్‌ ద్వారా ప్రజలు తెలుసుకోకుండా డిసెంబరు నుంచే అడ్డుకుంది.
  • టీకా తయారీకి ఇతర దేశాలకు సాయం చేయడానికి నిరాకరించింది.
  • వైరస్​ కేసులు, తీవ్రతను తగ్గించి చెప్పడంతో ఇతర దేశాలు వెంటనే అప్రమత్తం కాలేకపోయాయి.
  • వైరస్​ వ్యాప్తిలో అత్యంత ప్రమాదకారులైన గుప్తవాహకుల గురించి దాచి పెట్టింది.

డ్రాగన్​కు డిసెంబర్​లోనే తెలిసిందా?

చైనాలో డిసెంబరు తొలి రోజుల్లోనే వైరస్‌ విజృంభణ ప్రారంభమైనట్లు రహస్య నివేదిక వెల్లడించింది. ఇంకా ఏం చెప్పిందంటే..

  • మనిషి నుంచి మనిషికి వైరస్‌ సోకుతోందని అప్పుడే తెలిసినా జనవరి 20 వరకు ఆ విషయాన్ని చైనా ఖండిస్తూనే ఉంది.
  • డిసెంబరు 31 నుంచి... సార్స్‌, వుహాన్‌ సముద్ర మాంసం విపణి, వుహాన్‌లో గుర్తు తెలియని న్యుమోనియా పదాలు ఇంటర్నెట్‌లో లేకుండా చేసింది.
  • వైరస్‌ నమూనాలను నాశనం చేయాలని, వాటి గురించి ఎలాంటి సమాచారాన్ని ప్రచురించవద్దని జనవరి 3న చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులు ఆదేశించింది.
  • చైనాలో అన్ని రకాల ప్రయాణాలను జనవరిలోనే నిలిపేసింది. మిగిలిన ప్రపంచానికి మాత్రం అసలు ప్రయాణాలు ఆపాల్సిన అవసరమే లేదని చెబుతూవచ్చింది. దీనివల్ల ఫిబ్రవరి నెలంతా వేల మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేశారు. అమెరికా, ఇటలీ, భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాసియా దేశాలు రాకపోకలపై నిషేధం విధించాలని ఆలోచిస్తే చైనా తీవ్రంగా విమర్శించింది. తమ దేశంలో మాత్రం తీవ్ర ఆంక్షలను అమలుచేసింది.

వీరు ఏమయ్యారు?

  • వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తోందని హెచ్చరించిన వైద్యులు, శాస్త్రవేత్తలు కనిపించకుండా పోయారు. కొందరు శిక్షలకు గురయ్యారు.
  • వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధకురాలిగా పనిచేస్తున్న హువాంగ్‌ యాన్‌ లింగ్‌ని పేషెంట్‌ జీరోగా భావిస్తున్నారు. ఆమె అనుమానాస్పదంగా మాయమైంది. ప్రయోగశాల వెబ్‌సైట్‌ నుంచి ఆమె వివరాలు తొలగించారు. అయితే ఆమె జీవించే ఉన్నారని, కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదంటూ ప్రయోగశాల ప్రకటించింది.
  • మహమ్మారి గురించి మాట్లాడిన వ్యాపారవేత్త ఫంగ్‌బిన్‌, న్యాయవాది ఛెన్‌క్యూషి, మాజీ టీవీ రిపోర్టర్‌ లీ జెహువాలను డిటెన్షన్‌ సెంటర్‌లో పెట్టడమో, శిక్షించడమో చేశారు.

ఎవరివీ 5ఐస్​?

ఇంగ్లిషు మాట్లాడే అతిపెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలతో ఏర్పడినదే ‘5 కళ్ల కూటమి’. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే ఈ దేశాలు కలిసి పనిచేస్తున్నా.. 1946లో కూటమిని అధికారికంగా ఏర్పాటుచేశాయి. ప్రపంచంలోని వివిధ దేశాల రక్షణ కార్యకలాపాలపై కన్నేసి, సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం దీని ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ‘ఎకెలాన్‌’ అనే అతిపెద్ద నిఘా వ్యవస్థను అమెరికా నడుపుతుండగా.. దీని సేవలను మిగిలిన సభ్యులు పొందుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఈ కూటమి చాలా చురుగ్గా పనిచేసింది. ప్రస్తుత కొవిడ్‌ కల్లోలంపై ఈ కూటమి 15 పేజీల నివేదికను తయారుచేసింది. అది బయటికి పొక్కడంతో దుమారం రేగుతోంది.

వైరస్​ వ్యాప్తి నివేదిక ఏం చెప్పిందంటే?

2013

చైనా పరిశోధకులు గబ్బిలం నుంచి వైరస్​ను సేకరించారు. దీని జన్యుక్రమం కోవిడ్​ 19లోని జన్యుక్రమంతో 96శాతం సరిపోతుంది.

2015 నవంబర్​ 9

తాము కరోనా వైరస్​ను సృష్టించినట్టు వుహాన్​ ప్రయోగశాల ప్రకటించింది.

2019 డిసెంబర్​ 6

వుహాన్​ మార్కెట్​లో న్యుమోనియాతో బాధపడుతున్న భర్తను తాకిన భార్యకు అదే లక్షణాలతో జ్వరం వచ్చింది. ఇదే మనిషి నుంచి మనిషికి సోకిన కరోనా తొలి కేసు

డిసెంబర్​ 27

తమ దేశంలోని 180మందికి వైరస్​ సోకినట్టు చైనా ప్రకటించింది.

జనవరి 1

వైరస విజృంభణపై హెచ్చరించిన వుహాన్​లోని వైద్యుల అరెస్టు.

జనవరి 10

వైరస్​ వ్యాప్తి నియంత్రణలోనే ఉందంటూ చైనా అధికారుల ప్రకటన.

జనవరి 11

చైనాలో తొలి కరోనా మృతి నమోదు

జనవరి 23

వుహాన్​లో పూర్తి లాక్​డౌన్​ విధింపు

జనవరి 30

వైరస్​ వ్యాప్తిని మహమ్మారిగా ప్రకటించిన డబ్ల్యూహెచ్​ఓ

ఫిబ్రవరి 7

కరోనా గురించి తొట్టతొలిగా మాట్లాడిన వైద్యుడు లీ వెన్​లియాంగ్​ వైరస్​తో మృతి

ఏప్రిల్​

వుహాన్​ కోలుకుంది. మిగిలిన ప్రపంచం కొవిడ్​ కొరల్లో చిక్కుకుంది.

అసలు వైరస్​ ఎక్కడ పుట్టింది?

కరోనా వైరస్‌ ప్రయోగశాలలో పుట్టిందా? మార్కెట్‌లో బయటపడిందా? అనే విషయమై 5 కళ్ల కూటమిలోని దేశాల మధ్యే ఏకాభిప్రాయం లేదు. అదే సమయంలో ఆయా దేశాలు బ్యాట్‌ ఉమన్‌ షియాంగ్‌ లీ చేసిన ప్రయోగాల ఆధారంగా వైరస్‌ పుట్టుకపై పరిశోధన చేస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ... ప్రయోగశాలలోనే వైరస్‌ పుట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని గట్టిగా ప్రకటించారు. అయితే... అమెరికాలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సంచాలకులు రిజర్డ్‌ గ్రెనెల్‌ మాట్లాడుతూ...‘వైరస్‌ను మనుషులే తయారు చేశారని లేదా జన్యుక్రమాన్ని మార్చారనే విషయాన్ని చాలామంది పరిశోధకులు కొట్టిపడేస్తున్నారు. వారి అభిప్రాయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అంటూ ప్రకటించారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ప్రయోగశాల నుంచి బయటికి వచ్చి ఉండొచ్చని కొందరు అంటున్నా... ఆ అవకాశం లేదని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు.

ఆ మబ్బులన్నీ తొలగిపోతాయి...

ఎంత కష్టం వచ్చినా నేను విదేశాలకు పారిపోను. మేం తప్పు చేయలేదు. సైన్స్‌పై ఉన్న అపార నమ్మకంతో ఒక విషయం చెబుతున్నా.. ఏదో ఒకరోజు మేఘాలన్నీ తొలగిపోయి, ప్రకాశవంతమైన సూర్యకాంతి కనిపిస్తుంది

--- షీ జియాంగ్​లీ, బ్యాట్​ ఉమెన్​

ABOUT THE AUTHOR

...view details