తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్ బరితెగింపు- గిల్గిత్​పై కొత్త కుట్ర - గిల్గిట్ రాష్ట్ర హోదా

గిల్గిత్-బాల్టిస్థాన్​పై కయ్యాలమారి పాకిస్థాన్ కొత్త కుట్రలు పన్నుతోంది. వివాదాస్పద భూభాగంగా ఉన్న గిల్గిత్-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ బరితెగించి... ఇందుకు కసరత్తులు చేస్తోంది. అసలు ఈ వివాదం ఏంటి? దీనిపై భారత్ వైఖరి ఏంటి? అనే విషయాల సమాహారం.. ఈ కథనం.

gilgit baltisthan overall
పాకిస్థాన్ బరితెగింపు-గిల్గిత్​పై కొత్త పాచిక

By

Published : Sep 24, 2020, 3:52 PM IST

ఆర్టికల్-370 రద్దు నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాకిస్థాన్ కొత్త కుట్రలకు తెరతీసింది. అన్యాయంగా ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్​కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే పనిలో పడింది. పాక్​ను పక్క దేశంగానే పరిగణించే అక్కడి ప్రజలను బలవంతంగా తనలో కలుపుకోవాలని పన్నాగాలు రచిస్తోంది.

ఇదీ చదవండి-గిల్గిట్​​-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా ఇచ్చే పనిలో పాక్

పాక్ మంత్రి వ్యాఖ్యలతో

ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్​ పత్రిక కథనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని రకాల రాజ్యాంగ హక్కులతో గిల్గిత్​-బాల్టిస్థాన్​కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వబోతున్నట్లు పాక్ మంత్రి అలీ అమిన్​ గండాపుర్ చేసిన వ్యాఖ్యలను పత్రిక ప్రచురించింది. ఈ హోదాపై పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారని స్పష్టం చేసింది.

గిల్గిత్-బాల్టిస్థాన్ అంటే?

భారత ఉపఖండానికి ఉత్తరాగ్రంలో ఉన్న ప్రదేశమే ఈ గిల్గిత్-బాల్టిస్థాన్. జమ్ముకశ్మీర్​కు ఉత్తరంగా, చైనాను ఆనుకొని ఉంటుంది ఈ ప్రాంతం. కశ్మీర్​తో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ వైశాల్యం ఉన్న ఈ ప్రదేశం.. చాలా ఏళ్లు నుంచి భారత్-పాకిస్థాన్ మధ్య వివాదాస్పద ప్రాంతంగా మిగిలిపోయింది.

ఇదీ చదవండి-ఆ ఎన్నికల నిర్వహణపై పాక్​ను తప్పుబట్టిన భారత్

1963లో చైనాతో ఓ ఒప్పందం చేసుకుంది పాక్. దీని ప్రకారం గిల్గిత్-బాల్టిస్థాన్​లోని హుంజా లోయపై భౌగోళిక అధికారాలను చైనాకు కట్టబెట్టింది. ఈ విషయాన్ని అక్కడి ప్రజలకు కూడా తెలియనివ్వలేదు.

1974లో ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను రద్దు చేసింది. అక్కడి వైవిధ్యమైన సామాజిక స్థితిగతులు, స్థానిక సంస్కృతిని విచ్ఛిన్నం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది. 1970ల వరకు ఐకమత్యంగానే ఉన్న షియా, సున్నీల మధ్య చిచ్చు రగిల్చింది. ఇక ఈ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చేపట్టిన అకృత్యాలకు అంతే లేదు. ప్రస్తుతం షియాలు, సున్నీలు వేర్వేరు పట్టణాల్లో నివసించే పరిస్థితి దాపురించింది.

ఎన్ని ఉన్నా పేదరికమే!

సింధు నది గిల్గిత్-బాల్టిస్థాన్ నుంచే ప్రవహిస్తుంది. ఎన్నో విలువైన ఖనిజాలకు ఈ ప్రాంతం నిలయం. అయినప్పటికీ ఇక్కడి ప్రజలకు పేదరికం తప్ప మరో మాట తెలియదు. ఆర్థికంగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది. అక్కడి స్థానిక మీడియానూ ఈ ప్రాంతంలోకి అనుమతించదు పాక్ సర్కార్.

చైనా దోస్తీపైనా

చైనాతో పాకిస్థాన్ చేసుకున్న సీపెక్(చైనా-పాక్ ఆర్థిక నడవా) ఒప్పందంపై ఇక్కడి ప్రజలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గిల్గిత్ ప్రజల అనుమతి లేకుండానే ఈ ఒప్పందంపై సంతకం చేసింది పాక్. సీపెక్​ వల్ల గిల్గిత్​-బాల్టిస్థాన్​లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరోపా మేధో సంస్థలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రహదారులు, నిర్మాణాలు అక్కడి భౌగోళిక స్థితిగతులపై హానికరమైన ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సీపెక్​ కోసం భూమిని సేకరించేందుకు అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తోంది.

సీపెక్ విషయానికి వచ్చే వరకు గిల్గిత్-బాల్టిస్థాన్​ను తనలో అంతర్భాగంగా చెప్పుకొనే పాక్.. మానవ హక్కుల ఉల్లంఘన ఊసెత్తేసరికి.. దీన్ని వివాదాస్పద భూభాగంగా పరిగణిస్తుంది.

ప్రస్తుత వివాదం ఏంటి?

గిల్గిత్-బాల్టిస్థాన్​కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు పాక్ మంత్రి పేర్కొన్నారు. ఐదో రాష్ట్రంగా దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాక్ సైన్యాన్ని విదేశీ సేనలుగా వర్ణిస్తూ.. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు, వాయిదా పడ్డ ఈ ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది పాక్ ప్రభుత్వం.

గిల్గిత్-బాల్టిస్థాన్​పై నిపుణుల మాట

ఈ ప్రాంతాన్ని తన అవసరాల కోసం దుర్వినియోగం చేసిందని పాకిస్థాన్​పై 'గిల్గిత్-బాల్టిస్థాన్ థింకర్స్ ఫోరం' దుమ్మెత్తి పోసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ తీరును ఇటీవలే ఎండగట్టింది. వివాదాస్పద స్థలంలో డయామెర్-బాషా డ్యామ్​ను పాక్ నిర్మిస్తోందని.. ఫలితంగా ఈ ప్రాంతంలో వేలాది మంది నిరాశ్రయులు అవుతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు వేలాది రాతి శిల్పాలు నీటిలో మునిగిపోతాయని పేర్కొంది.

భారత్ వైఖరి ఏంటి?

గిల్గిట్-బాల్టిస్థాన్​ను భారత్ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. ఈ భూభాగంపై పాకిస్థాన్​కు ఎలాంటి హక్కులు లేవని చెబుతోంది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది. సీపెక్​ కారిడార్​ పీఓకే నుంచి వెళ్తుండడంపై అభ్యంతరం ​వ్యక్తం చేసింది​.

ఇదీ చదవండి-గిల్గిత్-బాల్టిస్థాన్​లో ఎన్నికలపై భారత్​-పాక్​ ఢీ

గిల్గిత్-బాల్టిస్థాన్​లో ఎన్నికలు నిర్వహించడాన్నీ భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జమ్ము కశ్మీర్​, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు గిల్గిత్​-బాల్టిస్థాన్​ భారత భూభాగంలోనే ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. గిల్గిత్​లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా నిరసన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details