అభినందన్ వర్ధమాన్ విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు పీఎంఎల్-ఎన్ పార్టీ నేత, ఎంపీ అయాజ్ సాదిఖ్. అన్ని రహస్యాలు తనకు తెలుసునని అన్నారు. కానీ, తానెప్పుడూ బాధ్యతారహితంగా మాట్లాడలేదని చెప్పారు.
'అభినందన్‌ను నిర్బంధించినప్పుడు పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ ఖామర్ జావేద్ బాజ్వా కాళ్లు వణికిపోయాయని' ఇటీవల వ్యాఖ్యానించారు సాదిఖ్. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి, ఆ దేశ ఆర్మీ నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సాదిఖ్ తన వ్యాఖ్యలను సరిచేసుకోవాలని ఆ దేశ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ చీఫ్ జనరల్ బాబర్ ఇఫ్తేకర్ హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే.. తన వద్ద చాలా రహస్యాలున్నాయని తెలిపారు పాక్ ఎంపీ.
"ఇవన్నీ రాజకీయ భేదాలు. నా మాటలను సాయుధ బలగాలతో ముడిపెట్టడం సరికాదు. భారతీయ మీడియా చేతిలో ప్రభుత్వం కీలు బొమ్మలా మారింది. పాకిస్థాన్‌కు మీరు న్యాయం చేయలేదు. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. నాకు చాలా రహస్యాలు తెలుసు. జాతీయ భద్రతా కమిటీకి నేను నాయకత్వం వహించాను."