ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ డెల్టా రకం చైనాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ హెచ్చరించింది. జియాంగ్సు ప్రావిన్స్‌లోని నన్‌జింగ్ నగరంలో తొలిసారి డెల్టా రకాన్ని గుర్తించారు. ఇక్కడి విమానాశ్రయ సిబ్బందికి వైరస్ సోకగా.. ఈ రకం బయటపడింది. ఇది మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ సీనియర్ అధికారి హీ కింగ్ హువా పేర్కొన్నారు.
నన్‌జింగ్ విమానాశ్రయంలో రష్యా నుంచి వచ్చిన ఓ విమానాన్ని శుభ్రపరిచే సిబ్బంది ద్వారా డెల్టా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో నిత్యం వేసవి పర్యటకులతో కిటకిటలాడే విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. మరోవైపు ప్రముఖ పర్యటక కేంద్రం రూంగ్‌జియాజీలోని అన్ని ప్రాంతాలను మూసివేశారు. 11 పొరుగు ప్రాంతాలను మధ్యస్థ స్థాయి ముప్పు ఉన్నవిగా ప్రకటించారు.