ఇండోనేసియాలో కరోనా తీవ్రత భారత్‌ను మించిపోయింది. గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. గురువారం కొత్తగా 56,757 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 982 మంది మరణించారు. దీంతో ఆసియాలో వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది.
జావా, బాలి ద్వీపాల నుంచి పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కారణంగా ఆయా ద్వీపాల్లో ఇప్పటికే.. పాక్షిక లాక్డౌన్ విధించారు.
నెల రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య కేవలం 8 వేలుగా ఉండేది. కానీ.. ఇప్పుడు భారత్ వంటి దేశాల కన్నా అధికంగా కేసులు బయటపడుతున్నాయి. మరోవైపు, కోటి 56 లక్షల మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు వేయగలిగింది.
కొరియాలో తొమ్మిదో రోజూ..
దక్షిణ కొరియాలోనూ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వరుసగా తొమ్మిదో రోజు కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గురువారం 1600 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాజధాని సియోల్‌లోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ కొవిడ్ విజృంభణ తీవ్రంగా ఉంది.