భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటలు తననెంతగానో హత్తుకున్నాయని జపాన్ ప్రధాని షింజో అబె అన్నారు. అబె అనారోగ్యానికి గురికావడంపై ఆవేదన వ్యక్తం చేసిన మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అబె సోమవారం స్పందించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం మున్ముందు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ జపనీస్, ఆంగ్లంలో ట్వీట్లు చేశారు.
షింజో అబె అనారోగ్యానికి గురి కావడంతో పదవి నుంచి వైదొలగాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో జపాన్- భారత్‌ల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా దృఢమైన ద్వైపాక్షిక బంధాన్ని నెలకొల్పేందుకు అబే కృషిచేశారంటూ మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే.
అబెకు ట్రంప్ ఫోన్!
జపాన్ ప్రధాని షింజో అబె త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఆకాంక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబెకు ఫోన్ చేసి మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. అబె ఎంతో గొప్ప ప్రధాని అని కొనియాడారని తెలిపింది. అమెరికా, జపాన్ ద్వైపాక్షిక బంధం గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగుపడటంలో అబె ఎంతో కృషి చేశారని ప్రశంసించారని పేర్కొంది. అబె త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్న వేళ జపాన్ భవిష్యత్తు కోసం నిస్సందేహంగా తాను పెద్ద పాత్ర పోషిస్తానని ట్రంప్ అన్నారని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు, జపాన్‌లో దీర్ఘకాలం ప్రధాన మంత్రి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా షింజో అబె పేరిట కొత్త రికార్డు సృష్టించారు. ఆయన పదవీ కాలం 2021 సెప్టెంబరు వరకూ ఉంది. కరోనా వ్యాప్తి, ఆర్థిక మందగమనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. నూతన ప్రధాన మంత్రిని ఎన్నుకొనే వరకూ అబె ఆ పదవిలో కొనసాగనున్నారు.