తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతర్జాతీయ ఉగ్రవాదిగా అజార్​... నేడే నిర్ణయం! - ఐరాస

పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే ఉగ్రసంస్థ జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ అంశంపై ఐరాస ఆంక్షల కమిటీ నేడు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ కరుడుగట్టిన ముష్కరుడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని అమెరికా నేరుగా తీర్మానం ప్రవేశపెట్టింది. బ్రిటన్​, ఫ్రాన్స్ మద్దతుగా నిలిచాయి.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా అజార్​...!

By

Published : May 1, 2019, 11:58 AM IST

Updated : May 1, 2019, 1:15 PM IST

అజార్​ చిక్కు తొలగేనా...?

పుల్వామా ఉగ్రదాడి బాధ్యుడు, కరుడుగట్టిన జైషే ఉగ్రవాది మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనపై నేడు నిర్ణయం వెలువడే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ భేటీలో అజార్​ అంశం చర్చకు వచ్చే అవకాశాలెక్కువ. అనంతరం.. ఒక నిర్ణయం తీసుకోనుంది.

అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్​ ఎప్పటి నుంచో కోరుతోంది. అనేక దేశాలు మద్దతు పలికాయి. కానీ... పాకిస్థాన్​ మిత్రదేశం చైనా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తోంది. తాజాగా... అజార్​ సమస్యకు సరైన రీతిలో పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించింది చైనా. నేడు ఈ అంశంపై మసూద్​ అజార్​కు వ్యతిరేకంగా చైనా నిలుస్తుందా...? అతనిపై ఆంక్షలకు ఐరాసకు మార్గం సుగమం చేస్తుందా..? అనేది వేచి చూడాలి.

మసూద్ నిషేధంపై అయిదోసారి తీర్మానం

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధిపతి మసూద్ అజార్​పై నిషేధం విధించాలని ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది అగ్రరాజ్యం అమెరికా. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ఈ తీర్మానానికి బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. గత పదేళ్లలో అజార్​పై​ నిషేధానికి ఐరాసలో ప్రతిపాదన ఐదోసారి కావడం గమనార్హం.

అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, ఆస్తులు- ఆయుధాల స్వాధీనం వంటి కీలక ప్రతిపాదనలను ఆంక్షల కమిటీ ముందు ప్రవేశపెట్టాయి. ఫలితంగా... ఒకసారి అజార్​పై నిషేధం అమలైతే అతడి ఉగ్రకార్యకలాపాలకు ఎలాంటి నిధులందే అవకాశం ఉండదు.

ఎన్నో అభియోగాలు....

2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, 2016లోనే ఉరీ సైనికస్థావరంపై దాడి.. ఇలా పలు భయానక ఉగ్రవాద కార్యకలాపాలకు మసూదే సూత్రధారి.
ఎప్పటినుంచో మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్​ సహా పలు దేశాలు కోరుతున్నాయి.

4 సార్లు నిరాశే....

  • భారత్​ తొలిసారిగా 2009లో మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే విధానపర నిర్ణయం తీసుకుంది.
  • మళ్లీ 2016లో ఐరాస- 1267 ఆంక్షల కమిటీ ముందు అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​తో కలిసి రెండో సారి ప్రతిపాదన తీసుకొచ్చింది.
  • 2017లో మూడోసారి అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే నిర్ణయం తీసుకొని, ఐరాసకు కదిలాయి అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్.
  • 2019 మార్చిలో జైషే మహ్మద్​ పుల్వామా దాడికి బాధ్యత వహించిన కారణంగా మరోసారి ప్రతిపాదన ప్రవేశపెట్టాయి పీ-3 దేశాలు.

అయితే ఈ 4 సార్లు అజార్​పై నిషేధానికి అడ్డుపడింది ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో వీటో అధికారమున్న చైనానే.

ఇదీ చూడండి:రణరంగాన్ని తలపిస్తున్న వెనెజువెలా

Last Updated : May 1, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details