ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ (Nepal Rain Today) చిగురుటాకులా వణికిపోతోంది. వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంగా గురువారం మరో 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. మరో 30 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు నేపాల్ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.
తూర్పు నేపాల్లోని పంచాతర్ జిల్లాలో అత్యధికంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలమ్, దోతి జిల్లాలో 13 మంది చొప్పున మరణించారు. మరో 15 జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ మరణాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
నేపాల్లోని(Nepal Rain Today) 20 జిల్లాలు.. వరదల కారణంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఒక్క బాఝంగ్ జిల్లాలో 21 మంది గల్లంతయ్యారని చెప్పారు. అయితే.. గురువారం నుంచి వాతావరణ పరిస్థితులు మెరుగు పడుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. హుమ్లా జిల్లాలో హిమపాతం వల్ల అక్కడ చిక్కుకున్న పర్యటకులను రక్షించాలని పోలీసులు, సాయుధ బలగాలు, సైన్యాన్ని.. నేపాల్ హోం శాఖ మంత్రి బాల్కృష్ణ ఖండ్ ఆదేశించారు.