తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక పేలుళ్లలో 290కి చేరిన మృతుల సంఖ్య

శ్రీలంక బాంబు దాడుల్లో మృతుల సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు.  ఆదివారం ఈస్టర్​ పర్వదినం రోజున శ్రీలంకలో మొత్తం 8చోట్ల బాంబు దాడులు జరిగాయి. దేశమంతా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొలంబొ విమానాశ్రయ సమీపంలో నేడు ఓ బాంబును నిర్వీర్యం చేశారు పోలీసులు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను ఎత్తివేసింది శ్రీలంక ప్రభుత్వం.

శ్రీలంక దాడుల ఘటనలో 290కి చేరిన మృతుల సంఖ్య

By

Published : Apr 22, 2019, 8:54 AM IST

Updated : Apr 22, 2019, 10:28 AM IST

శ్రీలంక వరుస బాంబు దాడుల ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరుకుంది. 500మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం ఈస్టర్​ రోజున దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి.

మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాలు హోటళ్లు సహా మరో రెండు చోట్ల బాంబు పేలుళ్లకు తెగబడ్డాయి ఉగ్రమూకలు.

ఎనిమిది చోట్ల పేలుళ్లు

కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బట్టికలోవాలోని చర్చిలో బాంబు పేలుళ్లు జరిగాయి. శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి ఐదు నక్షత్రాల హోటళ్లలో బాంబులు పేలాయి.

ఈ దాడుల నుంచి తేరుకునే లోపే మరో రెండు చోట్ల బాంబు దాడులకు తెగబడ్డారు ముష్కరులు. కొలంబోలోని దక్షిణ శివారు ప్రాంతంలో 7వ పేలుడు సంభవించింది.

ఉత్తర శివారు​ ప్రాంతంలో గాలింపు చర్యలకు వెళ్లిన భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు.
ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత వహించలేదు.

ప్రభుత్వం అప్రమత్తం

ఆదివారం జరిగిన బాంబు దాడులతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్య ప్రాంతాల్లో భారీగా సైనిక బలగాలను మోహరించింది. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు భద్రతా సిబ్బంది. అన్ని విమానాశ్రయాల్లో సోదాలు ముమ్మరం చేశారు. పరిస్థితిని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు.

విమానాశ్రయంలో బాంబు లభ్యం

కొలంబొలో నేటి ఉదయం ఓ బాంబును గుర్తించారు పోలీసులు. నిర్వీర్యం చేసినట్టు ప్రకటించారు. సోదాలు ముమ్మరం చేశారు.

అదుపులో 24 మంది
బాంబు దాడుల ఘటనలో మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారు శ్రీలంక పోలీసులు. వారిని విచారిస్తున్నారు.

కర్ఫ్యూ ఎత్తివేత

పేలుళ్లతో దేశవ్యాప్తంగా ఆదివారం విధించిన కర్ఫ్యూని నేడు ఎత్తివేసింది శ్రీలంక ప్రభుత్వం. అయినప్పటికీ రోడ్ల మీదికి రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.

Last Updated : Apr 22, 2019, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details