Dasu Attack on Chinese: పాక్-చైనాలు తమ బంధాన్ని 'ఐరన్ బ్రదర్స్ బంధం'గా చెప్పుకొంటాయి. కానీ, సొమ్ము విషయానికి వస్తే మాత్రం చైనా ఎక్కడా తగ్గదు. పాక్‌లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. 2021 జులై 14వ తేదీన పాకిస్థాన్‌లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ నిర్మాణ పనుల వద్ద భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో బీజింగ్ రంగంలోకి దిగింది.. ప్రాణాలు కోల్పోయిన తమ కార్మికుల కుటుంబాలకు 38 మిలియన్ డాలర్ల (రూ.282 కోట్లు) పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. చైనాలో ఉగ్రదాడిలో మరణిస్తే అక్కడి ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం.
అసలే పాకిస్థాన్‌లో పాలన నడపడానికే సొమ్ములు లేవు.. ఇక చైనాకు ఎక్కడి నుంచి తెచ్చిఇస్తుంది. ఈ మొత్తం ఇచ్చేందుకు పాక్ మొండికేసింది. దీంతో చైనా కాంట్రాక్టర్ దాసు డ్యామ్ పనులను అర్ధంతరంగా నిలిపివేశాడు. మళ్లీ పనులు మొదలుపెట్టాలంటే పలు డిమాండ్లు, నిబంధనలను పూర్తి చేయాలని మొండికేసి కూర్చున్నాడు.
ప్రపంచ బ్యాంక్ సహకారంతో దాసు హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఇది చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగం కాదు. కానీ, చైనా నిర్మాణరంగ సంస్థ జెగ్‌హుబా కంపెనీ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2015లో ప్రారంభించారు. కానీ, ఆత్మాహుతి దాడి ఘటన తర్వాత పనులు నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ది ఎకనామిక్ కో-ఆర్డినేషన్ కమిటీ, పాక్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా చైనా జాతీయులకు 11.6 మిలియన్ డాలర్లు (రూ.86.32 కోట్లు) చెల్లించాలని నిర్ణయం తీసుకొంది. మరోపక్క అదే చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియా ముందుకొచ్చి దాసు డ్యామ్ పనులు నిలిపివేతపై స్పందించారు. కాంట్రాక్టరు డిమాండ్లు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. డ్యామ్ పనులు మళ్లీ మొదలయ్యాయని వెల్లడించారు.