కరవు, కొవిడ్-19 వంటి విపత్తులకు తోడు ఇటీవల నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో (Afghanistan crisis) మహా మానవ సంక్షోభానికి దారితీస్తున్నట్లు ఐక్య రాజ్య సమితి ఫుడ్ రిలీఫ్ ఏజెన్సీ పేర్కొంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) బుధవారం విడుదల చేసిన నివేదిక (WFP report on Afghan) ప్రకారం.. అప్గానిస్థాన్‌లోని ప్రతి ముగ్గురిలో ఒకరు (దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది) ఆకలితో అలమటిస్తున్నట్లు తెలిసింది. దాదాపు 20 లక్షల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు తేలింది. వారికి వెంటనే వైద్యం అవసరమని నివేదిక పేర్కొంది.
అమాంతం పెరిగిన ధరలు..
దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో అఫ్గాన్‌లో గోధుమల ధరలు గత నెల రోజుల్లోనే 25 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆహార భద్రత, పిల్లల్లో పోషకాహార లోపాలు లేకుండా చూడటం అత్యంత కష్టమైన పని అని డబ్ల్యూఎఫ్‌పీ రీజినల్ డైరెక్టర్ జాన్ అలెఫ్ అభిప్రాయపడ్డారు.
ఏడాది ప్రారంభం నుంచి దేశంలో నెలకొన్న అస్థిరతలు, అభద్రతాభావం వంటి కారణాలతో దాదాపు 550,000 మంది ఇళ్లు విడిచి వెళ్లారు. 70 వేల మంది వరకు దేశ రాజధాని కాబుల్‌కు చేరుకున్నారని అంచనా.
దయనీయంగా పరిస్థితి..
'పంటలు పండక, వర్షాలు కురవక, తాగే నీరు కూడా లభించక ప్రజలు అత్యంత దుర్బర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్ల్యూఎఫ్‌పీ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పది. పేదలకు, అత్యవసరమైన వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి' అని 52 ఏళ్ల అఫ్గాన్ వాసి ఒకరు అక్కడ పరిస్థితిని వివరించారు. ఆయన మాటల ద్వారా అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవచ్చు.